2022-12-12 08:38:47.0
https://www.teluguglobal.com/h-upload/2022/12/12/430880-adugujada.webp
సాయంత్రం బడినుంచి వస్తూనే, “అమ్మా, నాన్న వచ్చాడా?” అనడిగాడు బుజ్జి.
“లేదు, నాన్నా! రేవుకాని వస్తాడేమో!” అంది అన్నపూర్ణ.
నిరుత్సాహంతో పుస్తకాల సంచిని పక్కను పడేసి బల్లమీద నిన్సత్తువగా కూలబడ్డాడు బుజ్జి.
“కాళ్ళూ చేతులూ కడుక్కునిరా, దోశ వేస్తాను” అంది అన్నపూర్ణ.
“నాకేమీ ఒద్దు ఫో! నిన్నా అలాగే చెప్పావు. ఇవాళ నాన్న తప్పకుండా వస్తాడని బెల్ కొట్టగానే ఆటలకు వెళ్ళకుండా పరుగెత్తుకొచ్చేసాను” అన్నాడు బుజ్జి నిరుత్సాహంతో.
ఎనిమిదేళ్ళుంటాయి వాడికి. మూడో తరగతి చదువుతున్నాడు.
“ఇవాళ కాకపోతే రేవు వస్తాడు. సెలవు దొరకాలికదా!” అంది అన్నపూర్ణ.
“నాన్న కోసం కలవరిస్తూ తిండి సరిగా తినడంలేదు నువ్వు. రేపు మీ నాన్న వచ్చి నా కొడుక్కి తిండి పెట్టడంలేదా, బక్కచిక్కిపోయాడు అంటూ నన్ను తిడతాడు”.
“ఔనా? అయితే సరే. దోశలు వెయ్యి వస్తున్నాను” అంటూ వెళ్ళి కాళ్ళూ
చేతులూ కడుక్కుని వచ్చాడు బుజ్జి. దోశలు తింటూ, “అమ్మా! నాన్న రేవు నిజంగా వస్తాడు కదూ?”
అనడిగాడు జాలిగా.
“సెలవు దొరకాలేకానీ ఎందుకు రాడు?” అందామె.
“అమ్మా! నాన్న ఫోన్ చేసేవాడు కదా? ఇప్పుడు ఎందుకు చేయడం లేదూ?”మళ్ళీ అడిగాడు వాడు.
“అప్పుడప్పుడు చేస్తూనేవున్నాడు కదా!” అంది.
“మరి నాతో మాట్లాడడంలేదు ఎందుకనీ?”
“ఫోన్ వచ్చినప్పుడు నువ్వు బళ్ళోనో, నిద్దట్లోనో ఉంటున్నావు మరి!” అంది మామూలుగా.
“ఐతే, ఈసారి నేను బడినుంచి వచ్చాక చేయమనవే”.
“అలాగేలే. ఐనా మనం కావాలనుకున్నప్పుడు దొరుకుతా దేంటీ లైను.
దొరికినప్పుడే చేయాలి” అంది. “సరే, నరే. నువ్వు తిని ఆడుకోడానికి వెళ్ళు” అన్నపూర్ణ భర్త రామ్మూర్తి సైన్యంలో హవల్దారుగా పనిచేస్తున్నాడు.
చైనా బోర్డర్ లో డ్యూటీ. కాశ్మీర్ లో ఉన్నప్పుడు ఏడాదికోసారి ఇంటికి వచ్చేవాడు. వచ్చినప్పుడు కొడుకుని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టడు. నాన్నంటే అమితప్రేమ బుజ్జికి. సెలవుకు అప్లయ్ చేసాననీ, షార్ట్ లీవ్ లో ఇంటికి వస్తున్నాననీ రెండు నెలల క్రితం ఫోన్ చేసి చెప్పాడు రామ్మూర్తి. ఇంతవరకు రాలేదు. ఫోన్ కూడా లేదు. తండ్రి రాకకోసం ఎదురుచూస్తూన్న బుజ్జికి నిరుత్సాహం ఎదురయింది.
రోజూ ‘నాన్న ఎప్పుడు వస్తాడమ్మా?’ అంటూ అడిగే కొడుక్కి ఏదో చెప్పి సమాధానపరుస్తోంది అన్నపూర్ణ.
అన్నం తినకుండా మరీ మారాముచేస్తే, ‘రేపు వస్తాడు’ అని చెబుతోంది.
ఒక్కోసారి, ‘ఇవాళ నాన్న వస్తాడు. నేను బడికి వెళ్లనంటే’ బుజ్జగించి వంపించేది. ‘నాన్న ఫోన్ చేస్తాడు, ఆటలకు వెళ్ళననో, లేక నిద్రపోననో” అంటే, ఎలాగో నచ్చజెప్పేది.
ఆ రోజు బళ్ళోంచి పుస్తకాలనంచి చేత్తో పట్టుకుని కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు బుజ్జి. ఎప్పటిలా ‘నాన్న వచ్చాడా?’ అనడగలేదు. సంచిని నేలమీద వడేసి బల్లమీద నిస్సత్తువగా చతికిలబడ్డాడు.
“ఎందుకలా వున్నావు?” అని తల్లి అడగడంతో, నిర్జీవంగా చూసాడు. “అమ్మా! నాన్న లేడా?” అనడిగాడు.
ఆమె ఉలిక్కిపడి, “అదేంటి? నువ్వు బళ్ళోకి వెళ్ళాక ఫోన్ చేసాడుగా? రేవు వస్తానన్నాడు” అంది.
తల్లిని కావలించుకుని ఏడ్చేసాడు వాడు. “చైనావాళ్ళతో జరిగిన పోట్లాటలో నాన్న చచ్చిపోయాడని మా మాస్టారు చెప్పారు”.
నిశ్చేష్ఠురాలయిందామె. రెండునెలల క్రితం- చైనా సరిహద్దులలో గాల్వన్ లోయలోకి అక్రమంగా చొచ్చుకువచ్చిన చైనా సైనికుల్ని భారత సైనికులు అడ్డుకోవడం జరిగింది. అప్పుడు జరిగిన తీవ్రఘర్షణలో ఎందరో చైనీయులు, కొందరు భారతీయులూ చనిపోవడం జరిగింది.
వారిలో రామ్మూర్తి కూడా ఉన్నాడు. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల రామ్మూర్తి భౌతికదేహాన్ని అక్కడే ఖననం చేయడం జరిగింది. సెలవులో వస్తాడనుకున్న భర్త యొక్క మరణవార్త అన్నపూర్ణను కృంగదీసింది.
ఐనా ఓ వీరసైనికుడి భార్యగా గుండె దిటవుచేసుకుంది. భర్త దేశంకోసం ప్రాణత్యాగం చేసాడు. అతని ఆశయం ప్రకారం బుజ్జిని బాగా చదివించి ప్రయోజకుణ్ణి చేయాలని నిశ్చయించుకుంది.
‘నాన్న ఇక లేడు’ అన్న సంగతి వాడికి తెలియకుండా జాగ్రత్తపడుతోంది.
“అమ్మా! మాస్టారు చెప్పారు, నాన్న దేశంకోసం చనిపోయాడని. పెద్దయ్యాక నేను కూడా సైన్యంలో చేరతానమ్మా. చైనావాళ్ళను తరిమికొడతాను.
నాన్న పేరు నిలబెడతాను” అంటూన్న కొడుకువంక అచ్చెరుపాటుతో నోరు తెరచుకుని చూస్తూవుండిపోయింది అన్నపూర్ణ.
సైన్యంలో చేరాలన్న కొడుకు యోచనకుభయపడలేదామె. దేశంకోసం తండ్రి అడుగుజాడలలో నడవాలనుకుంటున్నందుకు ఆనందం, కించిత్తు గర్వం పెనవేసుకున్నాయి ఆమెను. “అలాగేరా, నా చిట్టితండ్రీ!” అంటూ ప్రేమానురాగాలతో వాణ్ణి గుండెలకు హత్తుకుంది.
తిరుమలశ్రీ (హైదరాబాద్)
Adugujadalu,Tirumalasree,Telugu Kathalu