అదానీపై కేసు నమోదు.. వైట్‌హౌస్‌ స్పందన ఇదే

2024-11-22 04:14:58.0

ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంచ్‌ కమిషన్‌, న్యాయశాఖనే సరైన సమాచారం ఇవ్వగలదన్న వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కరీన్‌ జీన్‌ పియర్‌

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు నమోదుకావడం సంచలనం సృష్టించింది. సౌర విద్యుదుత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకోవడానికి భారత్‌లో రూ. 2,029 కోట్ల లంచాలు ఇచ్చారని, ఆ సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించారని గౌతమ్‌ అదానీ సహా ఏడుగురిపై కేసు నమోదైంది. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ స్పందించింది. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవని విశ్వాస్ం వ్యక్తం చేసింది.

వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కరీన్‌ జీన్‌ పియర్‌ తన రోజువారీ మీడియా సమావేశంలో అదానీ గ్రూప్‌ వ్యవహారం గురించి స్పందించారు. అదానీపై కేసు నమోదైన విషయం మా దృష్టికి వచ్చింది. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంచ్‌ కమిషన్‌, న్యాయశాఖనే సరైన సమాచారం ఇవ్వగలదు. భారత్‌ -అమెరికా మధ్య సంబంధాలు ఎప్పటివలె బలంగా ఉన్నాయి. అనేక అంశాలపై సహకారం అందించుకుంటున్నాం. మిగతా సమస్యల మాదిరిగానే ప్రస్తుత సంక్షోభాన్ని కూడా ఇరు దేశాలు అధిగమించగలవు. రెండు దేశాల మధ్య బంధం బలమైన పునాదిపై నిలబడిందని కరీన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. 

Gautam Adani,White House,Adani Group,India – US