అదే పనిగా ఫోన్ మాట్లాడితే… అధిక రక్తపోటేనా?

https://www.teluguglobal.com/h-upload/2023/05/18/500x300_765901-phone.webp
2023-05-18 08:27:25.0

ఫోన్ లో ఎక్కువ సమయం మాట్లాడటం అనేది అధికరక్తపోటుని పెంచే సైలెంట్ కిల్లర్ గా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

ఎక్కువ సమయం ఫోన్లలో మాట్లాడటం వలన రక్తపోటు పెరుగుతుందని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. వారానికి అరగంట కంటే ఎక్కువ సమయం సెల్ ఫోన్లో మాట్లాడటం వలన హైపర్ టెన్షన్ లేదా అధికరక్తపోటుకి గురయ్యే అవకాశం ఉంటుందని యురోపియన్ హార్ట్ జర్నల్ డిజిటల్ హెల్త్ లో ప్రచురితమైన ఓ అధ్యయన ఫలితం పేర్కొంది.

వారానికి అరగంట లేదా అంతకంటే ఎక్కువ సమయం సెల్ ఫోన్లో మాట్లాడటం వలన అధికరక్తపోటు ప్రమాదం 12శాతం పెరుగుతుందని ఈ అధ్యయనం చెబుతోంది. ఎక్కువ సమయం ఫోన్ ని పట్టుకుని మాట్లాడటం వలన మెడ, భుజాలు, వెన్ను నొప్పులు పెరుగుతాయని, ఇవి కూడా అధిక రక్తపోటుకి దారి తీస్తాయని సదరు అధ్యయనం నిర్వహించిన నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సమయం ఫోన్ తో ఉండటం వలన ఒత్తిడి పెరుగుతుందని ఆ విధంగా కూడా రక్తపోటు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఫోన్ లో మాట్లాడుతూ కాలక్షేపం చేసేవారు దానికి బదులుగా ఆ సమయాన్ని వ్యాయామానికి, ఆత్మీయులను స్నేహితులను నేరుగా కలిసి మాట్లాడటానికి వాడుకుంటే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఫోన్ లో ఎక్కువ సమయం మాట్లాడటం అనేది అధికరక్తపోటుని పెంచే సైలెంట్ కిల్లర్ గా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అలాగే… ఫోన్ పట్టుకుని సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపేవారిలో కూడా అనేక అనారోగ్యాలు పెరిగే ప్రమాదం ఉందని, వీరు అదేపనిగా కూర్చుని ఉండటం వలన చురుకుదనం, వ్యాయామం లోపించి అనారోగ్యాల బారిన పడే ప్రమాదం పెరుగుతుందని అధ్యయనం నిర్వహించిన నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫోన్ ని ఎక్కువగా వాడటం వలన దానినుండి వచ్చే నీలం రంగు కాంతి ప్రభావంతో నిద్రా భంగం కలిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ విధంగా నాణ్యమైన నిద్ర లోపించడం వలన కూడా రక్తపోటు పెరిగే అవకాశం ఉంది.

ఫోన్ ని అతిగా వాడేవారిలో శారీరక చురుకుదనం లోపించడంతో వారు సరిగ్గా ఆహారాన్ని తీసుకోలేరు. దీనివలన కూడా క్రమంగా రక్తపోటు పెరుగుతుంది. ఫోన్ వాడకం పెరగటం వలన ఆరోగ్యకరమైన జీవనశైలికి దూరమవుతున్నామని వైద్యులు తరచుగా హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే సెల్ ఫోన్లో ఎక్కువ మాట్లాడటానికి అధిక రక్తపోటుకి మధ్య ఉన్న సంబంధంపై వైద్యుల్లో భిన్నాభిప్రాయాలు సైతం ఉన్నాయి.

సాధారణంగా అధికంగా సెల్ ఫోన్లో మాట్లాడేవారిలో మానసిక ఒత్తిడి, ఆందోళన వంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, కనుక వారి వ్యక్తిత్వ లక్షణాలే అధిక రక్తపోటుకి కారణం కావచ్చని, అధిక రక్తపోటు విషయంలో చాలా అంశాలు ప్రభావితం చేస్తాయని, ఫరిదాబాద్ లోని మరెన్గో ఆసియా హాస్పటల్స్ డైరక్టర్, కార్డియాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రాకేష్ రాయి సప్రా అభిప్రాయపడుతున్నారు. కనుక అధికరక్తపోటుని నియంత్రించడానికి సెల్ ఫోన్ కి దూరంగా ఉండమని సలహా ఇవ్వలేమని ఆయన అంటున్నారు.

అయితే ఈ అధ్యయన ఫలితం ఆధారంగా మనం కొన్ని విషయాలను అర్థం చేసుకోవచ్చు. సెల్ ఫోన్లో ఎక్కువగా మాట్లాడేవారిలో మానసిక స్థిరత్వం శక్తి తక్కువగా, ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కనుక దానివలన వారిలో రక్తపోటు పెరగవచ్చు. అలాగే ఎక్కువగా ఫోన్లో మాట్లాడటం వలన ఒత్తిడిని పెంచే అంశాలను గురించి మరింత తరచుగా అధికంగా మాట్లాడే అవకాశం ఉంటుంది కనుక అలా కూడా రక్తపోటు పెరగవచ్చు. మొత్తానికి వైద్యులలో భిన్నాభిప్రాయాలు ఉన్నా సెల్ ఫోన్లో ఎక్కువగా మాట్లాడటానికి, రక్తపోటు పెరుగుదలకు సంబంధం ఉందని అధ్యయనాల్లో రుజువైన సంగతి మాత్రం వాస్తవమే కనుక ఫోన్ సంభాషణలు మరీ శృతి మించకుండా చూసుకోవటమే మంచిది.

high blood pressure,Mobile calls,Health Tips
blood prressure, high blood prressure, high blood prressure treatment, Mobile calls, Mobile calls associated with risk of high blood pressure, research, telugu news, latest telugu news

https://www.teluguglobal.com//health-life-style/talking-on-phone-raises-high-blood-pressure-933700