అనుకరణ

2018-10-02 20:01:04.0

తావో వాదికి అనుకరణతో, పనితనాన్ని ప్రదర్శించడంతో, నైపుణ్యంతో పన్లేదు. తెలివి తేటలన్నవి ఎదుటివాళ్ళని మోసగించడానికి, భ్రమ కలిగించడానికి పనికొస్తాయి.             తావోని అనుసరించేవాళ్ళు గుంపులో నిల్చోవాలనుకోరు. తమ గురించి ఇతరులు గొప్పగా అనుకోవాలని కోరుకోరు. వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ అంచనా వేసుకోరు. నమ్రతగా వుంటారు. ప్రపంచం దృష్టిలో పిచ్చివాళ్ళలా వుంటారు. తావోతో బాటు ప్రవాహంలా సాగుతూ నిత్య నూతన క్షణాల్ని ఆవిష్కరించుకుంటారు. ఎట్లాంటి స్థితిలోనైనా వాళ్ళు వాళ్ళుగా వుంటారు.             తావో వాదులు తెలుసుకున్న దాన్ని […]

తావో వాదికి అనుకరణతో, పనితనాన్ని ప్రదర్శించడంతో, నైపుణ్యంతో పన్లేదు. తెలివి తేటలన్నవి ఎదుటివాళ్ళని మోసగించడానికి, భ్రమ కలిగించడానికి పనికొస్తాయి.

తావోని అనుసరించేవాళ్ళు గుంపులో నిల్చోవాలనుకోరు. తమ గురించి ఇతరులు గొప్పగా అనుకోవాలని కోరుకోరు. వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ అంచనా వేసుకోరు. నమ్రతగా వుంటారు. ప్రపంచం దృష్టిలో పిచ్చివాళ్ళలా వుంటారు. తావోతో బాటు ప్రవాహంలా సాగుతూ నిత్య నూతన క్షణాల్ని ఆవిష్కరించుకుంటారు. ఎట్లాంటి స్థితిలోనైనా వాళ్ళు వాళ్ళుగా వుంటారు.

తావో వాదులు తెలుసుకున్న దాన్ని ప్రదర్శించరు. సమస్యవస్తే క్షణంలో పరిష్కరిస్తారు. సాయం కోరిన వాళ్ళకి ప్రయోజనమాసించకుండా తోడ్పడతారు.

ఒక ప్రతిభావంతుడయిన శిల్పి వుండేవాడు. అతను గొప్ప సాంకేతికమయిన నైపుణ్యం కలిగిన వాడు. ఓసారి అతను ముదిగా వున్న పచ్చను సంపాదించాడు. ఎంతో శ్రమించి ఆ మరకతాన్ని సానపట్టి తన పనితనంతో దాన్ని పల్చటి మల్బరీ ఆకులా మలిచాడు.

అదెంత పారదర్శకంగా వుందంటే పల్చటి ఆకులోని గీతలు కూడా పారదర్శకంగా కనిపించేలా తన నైపుణ్యం ప్రదర్శించాడు.

ఇంకా గొప్ప సంగతేమంటే మల్బరీ ఆకుల మధ్య ఆ మరకతంతో మలచిన ఆకును పెడితే ఏది అసలు ఆకో, ఏది మరకతంతో మలచిన ఆకో తేడా తెలుసుకోలేము. ఈ పని చెయ్యడానికి అతనికి మూడేళ్ళు పట్టింది.

ఆ శిల్పి ఆ మరకతంతో మలచిన ఆకును చక్రవర్తికి సమర్పించాడు. మామూలు ఆకుకు దానికి అభేదం ప్రదర్శించి చక్రవర్తిని ఆశ్చర్యానికిలోను చేశాడు. చక్రవర్తి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని పొంది ఆ శిల్పిని తన ఆస్థాన శిల్పిగా నియమించాడు.

తావో గురువయిన తాట్జు ఆ సంగతి విని ”పైన స్వర్గమూ కింద భూమి ఒక ఆకును సృష్టించడానికి మూడు సంవత్సరాలు తీసుకుంటే సృష్టి ఈ లక్షణాల్తో వుండేది కాదేమో” అన్నాడు!

– సౌభాగ్య

Devotional Story in Telugu,Telugu Devotional Story

https://www.teluguglobal.com//2018/10/03/అనుకరణ-devotional-story/