అమరావతి.. ఈసారి సినిమా వాళ్లకు చోటు లేదు

2024-08-02 09:55:56.0

అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవన సముదాయాలను హైదరాబాద్‌ ఐఐటీ నిపుణుల బృందం ఈరోజు పరిశీలించింది.

https://www.teluguglobal.com/h-upload/2024/08/02/1349148-babu-amaravati.webp

గతంలో రాజధాని అమరావతి విషయంలో సినీ దర్శకుడు రాజమౌళి సలహాలు కూడా తీసుకున్నారు సీఎం చంద్రబాబు. సింగపూర్ డిజైన్లు, ఇతరత్రా హడావిడి బాగానే జరిగింది. ఒకరకంగా ఆ హడావిడే చంద్రబాబు కొంప ముంచింది, 2019లో ఓటమికి కారణం అయింది. 2024లో తిరిగి అధికారంలోకి వచ్చాక రాజధాని నిర్మాణంపై మరోసారి సీఎం చంద్రబాబు దృష్టిసారించారు. అయితే ఈసారి సినిమావాళ్లకు అక్కడ ప్రయారిటీ లేదు. హడావిడి అసలే లేదు. మాటలు చెప్పడం కంటే చేతల్లో పని చేసి చూపించాలనుకుంటున్నారు చంద్రబాబు.

అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవన సముదాయాలను హైదరాబాద్‌ ఐఐటీ నిపుణుల బృందం ఈరోజు పరిశీలించింది. భవనాల పటిష్ఠత, సామర్థ్యాన్ని నిర్థారించడానికే తాము ఇక్కడకు వచ్చామన్నారు నిపుణులు. అయితే దానికి మరికొంత సమయం పడుతుందన్నారు. భవనాల ప్రస్తుత స్థితిని అంచనా వేసినా అక్కడ వర్షపు నీరు నిలిచి ఉందని, దాని ప్రభావంతో నిర్మాణ సామగ్రి దెబ్బతిన్నదని వారు తేల్చారు. పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి, సీఆర్డీఏకి నివేదిక అందజేస్తామన్నారు.

అమరావతికి 15వేల కోట్ల రూపాయల నిధుల్ని రుణంగా అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో హామీ ఇచ్చింది. వరల్డ్ బ్యాంక్ ఇచ్చే ఈ రుణానికి కేంద్రం పూచీకత్తు ఉంటుంది. ఈ నిధులతో అమరావతిలో పనుల్లో కదలిక వస్తుందని అంటున్నారు. అయితే అంతకు ముందే ఇప్పటి పరిస్థితుల్ని అంచనా వేసేందుకు నిపుణుల్ని పిలిపించారు. వారి నివేదిక ప్రకారం పనులు ఎలా మొదలు పెట్టేది ఆలోచిస్తారు.