2018-09-21 18:57:01.0
మహిళలను సెకండ్ జండర్‌గా చూసే సంప్రదాయం వలన వారు అన్ని రకాలుగానూ నష్టపోతున్నారు. చివరికి తిండి విషయంలోనూ. ఆడపిల్లలు, మగపిల్లల కంటే తక్కువ ప్రొటీన్లు విటమిన్లు ఉన్న ఆహారాన్ని తింటున్నారని ఒక అధ్యయనంలో తేలింది. మగవాడికి పనులు ఎక్కువ ఉంటాయని, ఇంటిభారం మోస్తాడని, శారీరక దారుఢ్యం అవసరమనే దృక్పథం మన సమాజంలో మొదటి నుండీ ఉంది. అందుకే చాలామంది తల్లులు ఆడపిల్లలకంటే మగపిల్లలకు బలమైన ఆహారం ఇవ్వాలని అనుకుంటారు. అయితే పిల్లలను కని పెంచాల్సిన బాధ్యత, ఇంటాబయటా […]
మహిళలను సెకండ్ జండర్‌గా చూసే సంప్రదాయం వలన వారు అన్ని రకాలుగానూ నష్టపోతున్నారు. చివరికి తిండి విషయంలోనూ. ఆడపిల్లలు, మగపిల్లల కంటే తక్కువ ప్రొటీన్లు విటమిన్లు ఉన్న ఆహారాన్ని తింటున్నారని ఒక అధ్యయనంలో తేలింది. మగవాడికి పనులు ఎక్కువ ఉంటాయని, ఇంటిభారం మోస్తాడని, శారీరక దారుఢ్యం అవసరమనే దృక్పథం మన సమాజంలో మొదటి నుండీ ఉంది. అందుకే చాలామంది తల్లులు ఆడపిల్లలకంటే మగపిల్లలకు బలమైన ఆహారం ఇవ్వాలని అనుకుంటారు. అయితే పిల్లలను కని పెంచాల్సిన బాధ్యత, ఇంటాబయటా పనుల ఒత్తిడి ఉన్న అమ్మాయిలకు కూడా మగపిల్లలతో సమానంగా మంచి ఆహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికీ ఆ పరిస్థితిలో మార్పు రాలేదని, ఇంటా, బయటా ఎక్కడైనా మగపిల్లలకు ఆడపిల్లలకంటే మంచి తిండి, భిన్నమైన తిండి తినే అవకాశం ఉందని ఆ అధ్యయనంలో రుజువైంది.
లండన్‌లోని ఆక్స్‌ఫార్డ్ యూనివర్శిటీ, ఇంపీరియల్ కాలేజి… తెలుగు రాష్ట్రాల్లోని పిల్లలపై ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. ఇందులో ఆడపిల్లల కంటే మగపిల్లలు ఎక్కువ ఖరీదైన ఆహారాన్ని, భిన్నమైన ఆహారాన్ని తింటున్నారని తేలింది. ఇందుకోసం 2006, 2009, 2014 సంత్సరాల్లో వెయ్యిమంది పెద్దపిల్లల నుండి, 2వేలమంది చిన్నపిల్లల నుండి వారు సమాచారాన్ని సేకరించారు. 5,8,12,15 సంవత్సరాల వయసున్న పిల్లలనుండి… వారు గత ఇరవై నాలుగు గంటల్లో ఏమితిన్నారు అనే సమాచారాన్ని తీసుకున్నారు. 15 ఏళ్లు వచ్చేసరికి అబ్బాయిలు అమ్మాయిలకంటే ఎక్కువ రుచులు చూస్తున్నారని ఈ అధ్యయనంలో తేలింది. తల్లిదండ్రుల దృక్పథం కూడా ఇందుకు కారణం అవుతోంది. మగపిల్లల చదువు, ఉద్యోగాల విషయంలో ఎక్కువ అంచనాలు ఉన్నపుడు తల్లిదండ్రులు వారికి మరింత మంచి ఆహారం ఇస్తున్నారు. టీనేజిలో ఉన్న అమ్మాయిలకు మరింత పౌష్టికాహారం అవసరం ఉన్నా, ఆ వయసు అబ్బాయలకంటే అమ్మాయిలు తక్కువ ప్రొటీన్లు, విటమిన్లు ఉన్న ఆహారం తింటున్నారని అధ్యయనం తేల్చి చెప్పింది. అయితే కుటుంబ ఆదాయం, తల్లి చదువుకుందా లేదా అనే అంశాలు అమ్మాయిలు, అబ్బాయిల ఆహార తేడాలపై ఎలాంటి ప్రభావం చూపటం లేదని ఈ అధ్యయనంలో వెల్లడైంది.