https://www.teluguglobal.com/h-upload/2025/01/22/500x300_1396602-kidny-rocket.webp
2025-01-22 06:48:14.0
ఉస్మానియా మాజీ సూపరింటెండెంట్ నాగేందర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు
కిడ్నీ రాకెట్‌లో నిజానిజాలు తేల్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసింది. ఉస్మానియా మాజీ సూపరింటెండెంట్ నాగేందర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ‘అలకనంద’ ఆస్పత్రిని నాగేందర్, డాక్టర్లు పరిశీలించారు. కిడ్నీ శస్త్రచికిత్సలపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని వారు తెలిపారు. మంగళవారం కిడ్నీ అక్రమ మార్పిడి ఆపరేషన్ల దందా కలకలం సృష్టించింది. సరూర్ నగర్‌లోని అలకనంద ఆస్పత్రిలో అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేస్తున్నట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. హాస్పిటల్‌లో నడుస్తున్న అక్రమ కిడ్నీ మార్పిడి రాకెట్‌ను రాచకొండ పోలీసులతో పాటు తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారులు వెలికితీశారు.తనిఖీల్లో భాగంగా కిడ్నీ మార్పిడి కోసం ఇద్దరు దాతలు, ఇద్దరు గ్రహీతలు ఉన్నట్లు అనుమానించిన అధికారులు నలుగురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సరైన అనుమతి లేకుండా పనిచేస్తున్న ఆసుపత్రిపై అజ్ఞాత సమాచారంతో అధికారులు దర్యాప్తు చేయడంతో ఆపరేషన్ వెలుగులోకి వచ్చింది.
సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో ఆరు నెలల కిందట అలకనంద ఆస్పత్రి ప్రారంభమైంది. జ్వరం, ఇతర చిన్న చికిత్సలు చేయడానికి మాత్రమే ఆస్పత్రికి అనుమతి ఉన్నది. కానీ అనధికారికంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయిస్తున్నట్లు సమాచారం అందడంతో వైద్యాధికారులు గీత, అర్చన, ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, సరూర్‌నగర్ సీఐ సైదిరెడ్డి మంగళవారం ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. ఆ సమయంలో నలుగురు చికిత్స తీసుకుంటూ కనిపించారు. వారి శరీరాన్ని పరిశీలించగా వీపు కింది భాగంగా పెద్ద శస్త్ర చికిత్స జరిగినట్లు గుర్తించారు. కిడ్నీ మార్పిడి చేయించినట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. మరింత స్పష్టత కోసం వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిని సీజ్ చేసినట్లు డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు ప్రకటించారు. సరూర్ నగర్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. అక్రమ కిడ్నీ మార్పిడి రాకెట్ ను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశించారు. కిడ్నీ రాకెట్‌లో నిజానిజాలు తేల్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసింది.
Illegal kidney transplant racket,Nusted,Telangana Health Minister,Orders strict action,Special Committee,On Kidney Racket Case