2022-12-12 10:51:12.0
https://www.teluguglobal.com/h-upload/2022/12/12/430907-surya.webp
నేను చూసాను
తాజ్ మహల్ సోయగాల
వెలుగుల వెనుక
కార్మికుల నీడలను
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా
ఆ సాగరంలో ప్రవహించే కర్షకుని చెమట చుక్కలను చూసాను
రాష్ట్రాలను కలిపే రహదారుల కింద
నలిగిన కూలీల రెక్కల కష్టాన్ని
ఆకాశాన్ని తలదన్నే
సౌధాల నిర్మాణంలో
కార్మికుల వెతలు చూసాను
అక్రమార్కుల కల్తీ కట్టడాలకు
బలైపోయిన వలస కూలీలు
సమాధి కావడం చూసాను
మనం తినే మెతుకులపై
పండించే రైతు పేరు లేకపోవడం
గొప్పవారు నడిచే ఎర్ర తివాచీ కింద
పేదవారి ఆకలిమంటలు
అణచివేయబడటం
నేను చూసాను
నిత్యం మనం అనుభవిస్తున్న
సుఖ సంపదల వెనుక
ఎందరు పనివారు స్వేదాశ్రువులు
చిందించారో…
ఎందరి
వేదనలు రోదనలు
కాంక్రీటు కింద నలిగి పోయాయో
నేను చూసాను.
అయినా వారు ఎప్పటికీ
అలుపెరుగని సూర్యులు
నిరంతరం శ్రమించే తత్వంతో
శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది ఏదీ లేదని
పిడికిలి బిగించి చూపిస్తారు
– ములుగు లక్ష్మీ మైథిలి (నెల్లూరు)
Aluperugani Suryulu,Telugu Kathalu,Telugu Poets