అవతారమూర్తులు

2023-10-02 15:45:06.0

https://www.teluguglobal.com/h-upload/2023/10/02/834210-avatharamurthulu.webp

నీవు నడచినచోట

శాంతిపూలను పరిచావట.

నీవు పలకరించిన చోట

అహింసామృతం చిలికించావట.

ప్రజాదాస్య విమోచనానికి

ఉత్సాహంగా ఉద్యమం నడిపావట

నీ బోసి నవ్వులతో గాంధీతాతవై

జనహృదయాలను దోచావట

నీ ఆలోచనలు సర్వసమ్మతమై

ఆదర్శమైన సిద్ధాంతాలై

జాతిపిత గా నిన్నుకొలుస్తున్నారట

భావితరాలకు మార్గదర్శకమై

‘గాంధేయం’రెపరెపలాడే పతాకమైందట

బుద్ధుని బోధల మర్మమెరిగి

భారతావని ఆత్మగౌరవం నిలిపిన

‘అవతారమూర్తి’వి నీవే మహాత్మా!

అమర్ రహే… బాపూ…!

అందుకోవయా మా వందనాలు!

ఆకారానికి ఆజానుబాహుడవుకావు

నీతి నిజాయితీల

కొలతలకందని వాడవు

నిరాడంబరత,సౌశీల్యం

నీ రెండు కళ్ళు

అఖండభారతావని

ద్వితీయ ప్రధాని గా

జాతి యావత్తు కొనియాడింది వేనోళ్ళు!

శాస్త్రీజీ నినాదం

జై జవాన్! జై కిసాన్!

మీకివియే

మా హృదయాంజలులు

-డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి

(అనకాపల్లి)

Dr Chakrapani Yammidshetty,Avatharamurthulu,Telugu Kavithalu