అవి ఉగ్రదాడులు.. బంగ్లా ఘటనలపై మాజీ ప్రధాని హసీనా

2024-08-14 03:21:53.0

దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన హసీనా ప్రకటనను.. ఆమె తనయుడు సాజిబ్‌ వాజెద్‌ జాయ్‌ ‘ఎక్స్‌’ వేదికగా విడుదల చేశారు.

బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా స్పందిస్తూ అవి ఉగ్రదాడులుగా పేర్కొన్నారు. తమ దేశంలో నమోదైన హత్యలు, విధ్వంసకాండలో భాగమైన వారిపై విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేశారు. తన పార్టీ అవామీ లీగ్‌ నేతలు, కార్యకర్తలు, ఇతరులపై జరిగిన ఇటీవలి హింసాత్మక ఘటనలను ఆమె తీవ్రంగా ఖండించారు. తనకు న్యాయం కావాలని డిమాండ్‌ చేశారు.

బంగ్లాదేశ్‌లో జరిగిన విధ్వంసక దాడుల్లో మృతిచెందినవారికి నివాళిగా ఈనెల 15ను జాతీయ సంతాప దినంగా జరపాలని హసీనా పిలుపునిచ్చారు. దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన హసీనా ప్రకటనను.. ఆమె తనయుడు సాజిబ్‌ వాజెద్‌ జాయ్‌ ‘ఎక్స్‌’ వేదికగా విడుదల చేశారు. ‘ఇటీవలి కాలంలో ఆందోళనల పేరిట కొంతమంది విధ్వంసానికి దిగారు. హింసాత్మక దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ నెల 15న బంగబంధు భవన్‌ వద్ద మృతులకు నివాళులర్పించాలని దేశ ప్రజలకు పిలుపునిస్తున్నాను. అదేవిధంగా.. ఇటీవలి హత్యలు, విధ్వంస చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి, తగిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తున్నా’ అని హసీనా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.

Sheikh Hasina,Demands,Probe,Protest,Killings,Murder case