ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన

2024-09-11 12:47:26.0

హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (Hydra) కీలక ప్రకటన చేసింది.

హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (Hydra) కీలక ప్రకటన చేసింది. ఆక్రమణలకు గురైన ప్రభుత్వం భూములు, చెరువులను పరిరక్షించేందుకు ఏర్పడిన హైడ్రా ఇప్పటి వరకు 100 ఎకరాలకు పైగా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో జూన్ 27 నుంచి ఇప్పటి వరకు మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలు కూల్చి వేసింది. దీని ద్వారా 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్టును అందజేసింది.

గగన్‌ పహాడ్‌ అప్పా చెరువులో 14, రామ్‌నగర్‌ మణెమ్మ గల్లీలో 3, మాదాపూర్‌ సున్నం చెరువులో 42, దుండిగల్‌ కత్వా చెరువు పరిధిలో 13, అమీన్‌పూర్‌ పెద్ద చెరువు పరిధిలో 24 అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా తెలిపింది. అధికంగా అమీన్‌పూర్‌లో 51 ఎకరాలు, మాదాపూర్‌ సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఇక హైడ్రాకు ఐపీఎస్‌ అధికారి రంగనాథ్‌ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గత రెండు నెలలుగా చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిబంధనలకు విరుద్దంగా ఉన్న నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. మరోవైపు హైడ్రాకు ప్రత్యేక పోలీసు సిబ్బందిని కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్‌ఐ స్థాయి పోలీసు అధికారులు ఆక్రమణల కూల్చివేత కోసం పనిచేయనున్నారు. 

 

hydra,hydra demolitions,Hyderabad,GHMC,Ranganath,Telangana