ఆదివాసీల హామీలు విస్మరిస్తే పోరు ఉధృతం చేస్తాం

2025-01-10 15:05:25.0

బీఆర్‌ఎస్‌ ఒత్తిడితోనే ఆదివాసీ సంఘాలతో సీఎం సమావేశం : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కాంగ్రెస్‌ ఏడాది పాలనలో ఆదివాసి గూడాలు ఆగమయ్యాయని, సమస్యల సుడిగుండంలో ఆదివాసీలు జీవిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. హామీలు ఇవ్వడం, ప్రకటనలు చేయడానికే పరిమితం కాకుండా సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆదివాసీ హక్కులు, సమస్యలపై బీఆర్‌ఎస్‌ చేసిన పోరాట ఫలితంగానే ఆదివాసీ సంఘాలతో సీఎం సమావేశమయ్యారని.. ఇది బీఆర్ఎస్‌ విజయమన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మీ, అనిల్‌ జాదవ్‌ తో కలిసి తాను బోథ్‌, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లోని ఆదివాసీ గూడాలను సందర్శించి వారి కష్టాలను స్వయంగా చూశానని తెలిపారు. కేసీఆర్‌ పాలనలో అభివృద్ధి చెందిన ఆదివాసీ గూడాలు.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్వనంగా మారాయన్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థ నిర్వీర్యమైపోయిందన్నారు. సీజనల్‌ వ్యాధులతో వాళ్లు సతమతమవుతున్నా సకాలంలో వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గురుకులాల్లో కలుషితాహారం తిని విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుందన్నారు. ఇకనైనా ప్రభుత్వం ఆదివాసీల సమస్యలకు పరిష్కారం చూపించాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీలను విస్మరిస్తే పోరు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Adivasis,Several Issues,BRS,Congress,Assurances of Govt,Revanth Reddy,Kalvakuntla Kavitha