2016-05-27 06:36:09.0
ఇండియన్ పీనల్ కోడ్ రేప్కి ఇచ్చే నిర్వచనాల్లో …భార్య 15 సంవత్సరాల లోపు అమ్మాయి కానపుడు, భర్త ఆమెతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనటం రేప్ కిందకు రాదు…అని ఉంటుంది. ఇందులో చాలా స్పష్టంగా… ఈ విషయంలో భార్య అనుమతి అక్కర్లేదనే అంశం మనకు అర్థమైపోతోంది. ఈ మధ్యకాలంలో మారిటల్ రేప్ మనదేశంలో బాగా చర్చనీయాంశంగా మారింది. కొంతమంది ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుకుంటూ పెళ్లే జరిగిపోతే ఇక రేపేంటి…అనవచ్చు. నిజమే, అత్యాచారం చేసిన అమ్మాయిని వివాహం చేసుకుంటే, చేసిన […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/05/women-sex.gif
ఇండియన్ పీనల్ కోడ్ రేప్కి ఇచ్చే నిర్వచనాల్లో …భార్య 15 సంవత్సరాల లోపు అమ్మాయి కానపుడు, భర్త ఆమెతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనటం రేప్ కిందకు రాదు…అని ఉంటుంది. ఇందులో చాలా స్పష్టంగా… ఈ విషయంలో భార్య అనుమతి అక్కర్లేదనే అంశం మనకు అర్థమైపోతోంది. ఈ మధ్యకాలంలో మారిటల్ రేప్ మనదేశంలో బాగా చర్చనీయాంశంగా మారింది. కొంతమంది ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుకుంటూ పెళ్లే జరిగిపోతే ఇక రేపేంటి…అనవచ్చు. నిజమే, అత్యాచారం చేసిన అమ్మాయిని వివాహం చేసుకుంటే, చేసిన నేరమే చట్టబద్దమైన కాపురం అయిపోతుందని నమ్మే మనుషులున్న ఈ దేశంలో…సంసార జీవితంలో రేప్లు ఉంటాయనేది నమ్మశక్యం కాని విషయమే.
మారిటల్ రేప్ని నేరంగా పరిగణించాలా వద్దా…అనే అంశంపై మనకు ఇంకా స్పష్టత లేదు. స్వయంగా మహిళా శిశు సంక్షేమశాఖా మంత్రి మేనకా గాంధీయే, మనదేశంలో ఉన్న నిరక్షరాస్యత, పేదరికం, సాంప్రదాయిక విలువలు, మతపరమైన నమ్మకాలు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే మారిటల్ రేప్ అనే భావన మనకు తగినది కాదనిపిస్తోందని అన్నారు. ఇష్టంలేని కాపురం రేపే కదా అవుతుంది…అని స్త్రీవాదులు అంటుంటే, ఆ మాటలను బరితెగింపుగానే భావిస్తున్నారు. మనం పెళ్లిలో అమ్మాయికి మంచాలు ఇచ్చామా, కంచాలు ఇచ్చామా… లాంటి విషయాలను అవేవో వైవాహిక బంధాన్ని నిలబెట్టే అంశాల్లా మాట్లాడుకుంటాం కానీ, పెళ్లి తరువాత అమ్మాయి, మానసికంగా మనిషిగానే ఉందా…బానిసగా మారిపోయిందా…అనే విషయాన్ని మాత్రం పట్టించుకోము.
అందుకే మనకు అనుకూలవతి అయిన భార్య అనే కాన్సెప్టు ఉంది కానీ అనుకూలుడైన భర్త…అనే మాట చాలా అరుదే….భర్తకు ఆనందాన్ని కలిగించడమే భార్య పరమావధి…అనే కాన్సెప్టుని సైతం మన పురాణాలు ఎన్నో రూపాల్లో మనకు చెబుతుంటాయి. ఇలాంటి పునాదులున్న సమాజం మ్యారిటల్ రేప్ అనే భావనను అర్థం చేసుకునేందుకు తప్పనిసరిగా సమయం పడుతుంది.
ఈ నేపథ్యంలో ఆన్లైన్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ టివిఎఫ్ సారధ్యంలో అంతా మహిళలే నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్ గర్లియాపాలో ఓ కొత్త ప్రయోగం చేశారు. అమెరికన్ సిట్కామ్ (సిట్యుయేషన్ కామెడి)గా ప్రాచుర్యం పొందిన హౌ ఐ మెట్ యువర్ మదర్‌కి స్ఫూఫ్గా హౌ ఐ రేప్డ్ యువర్ మదర్ (నేను మీ అమ్మను ఎలా రేప్ చేశానంటే…! ) అంటూ ఒక సెటైరికల్ సిట్యుయేషన్ ని సృష్టించారు.
ఇండియాలో ఏ అమ్మాయి అయినా తన భర్త తనను బలవంతం చేస్తున్నాడు…అంటే దానికి మితిమీరిన ప్రేమ అనో, మరొకటి అనో పేరు పెడతారు తప్ప రేప్‌గా మాత్రం అంగీకరించరు. హౌ ఐ రేప్డ్ యువర్ మదర్ లో…. దేవిక (ఆకాంక్షా ఠాకూర్) కుటుంబ సభ్యులందరితో కలిసి కూర్చు ని ఒక రేప్ గురించి చెబుతుంటుంది. ఆమె ముందు ఒక పెద్ద సూట్కేస్ ఉంటుంది. చివరికి ఆమె చెబుతున్నది ఆమె వైవాహిక జీవితం గురించే అని అందరికీ అర్థమవుతుంది. కుటుంబమంతా ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా అదంతా ప్రేమేనంటారు. ఆమె రేప్కి గురవుతున్నది తానే అన్నపుడు…కుటుంబంలోని మగవారంతా సీరియస్గా లేవబోతారు…కానీ ఆమె మ్యారిటల్ రేప్ అనగానే నవ్వుతూ ఆగిపోతారు. అందరూ కలిసి ఆమెకు అనేక విధాలుగా నచ్చచెబుతారు. ఈ లోపల దేవిక భర్త అరుణ్ వస్తాడు. దేవిక తండ్రి, తన కుమార్తెని కాస్త జాగ్రత్తగా చూసుకోమని…ఆమె నిదానంగా వైవాహిక జీవితానికి అలవాటు పడుతుందని చెబుతాడు. రోజంతా పనిచేసి వచ్చిన తనకు తన భార్య సాన్నిహిత్యమే టెన్షన్ ని తగ్గించే సాధనంగా అరుణ్ చెబుతాడు. కుటుంబంలోని వారందరూ బ్రెయిన్ వాష్ చేయగా దేవిక తనదే తప్పేమో, తానే స్వార్థంగా ఆలోచిస్తున్నానేమో అనే భ్రమలో పడిపోతుంది. తానుకూడా ఆదర్శమహిళగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. అంతా కలిసి ఆనందంగా సెల్ఫీ దిగుతారు.
అయితే ఇదంతా చూస్తున్న ఒక టీనేజి అమ్మాయి (దేవిక చెల్లెలు అనుకోవచ్చు) ఆశ్చర్యపోతుంది. దేవిక తన బాధని దిగమింగుకుంటే వారంతా ఎందుకు సంతోషపడుతున్నారో ఆమెకు అర్థం కాదు. తరువాత ఆమెను కూడా ఒకరు ఫ్యామిలీ సెల్ఫీలోకి లాగుతారు…దీంతో సింబాలిక్గా రేపు ఆమె పరిస్థితి కూడా అంతేనని చూపిస్తారు.
ఈ దేశంలో సంప్రదాయం పేరుతో చాలా అమానవీయమైన పనులు నిరభ్యంతరంగా జరిగిపోతుంటాయి. అందులో మ్యారిటల్ రేప్ ఒకటని చెప్పకతప్పదు. దీనికి కొసమెరుపు చెప్పుకోవాలంటే……….2014లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఉమెన్, యునైటెడ్ నేషన్స్ పాపులర్ ఫండ్ చేసిన ఒక అధ్యయనంలో ప్రతి ముగ్గురు మగవారిలో ఒకరు తాము సెక్స్కోసం తమ భార్యను, లేదా భాగస్వామిని బలవంతపెడుతున్నామని చెప్పారు.