ఆరు బాల్స్ లో ఆరు సిక్సర్లు 15 ఏళ్ల కుర్రాడి బాదుడే బాదుడు!

2022-06-05 01:53:26.0

క్రికెట్ మ్యాచ్ ఓ ఓవర్ ఆరు బాల్స్ లో ఆరు వరుస సిక్సర్లు బాదటం లాంటి రికార్డులు అత్యంత అరుదుగా చోటు చేసుకొంటూ ఉంటాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన క్రికెట్ లో ఇప్పటి వరకూ చేతివేళ్ల మీద లెక్కించదగినంత మంది ఆటగాళ్లు మాత్రమే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన మొనగాళ్లుగా నిలిచారు. ఓవర్లో ఆరు సిక్సర్ల రికార్డును తలచుకోగానే గారీ సోబర్స్, హెర్షల్ గిబ్స్‌ ,యువరాజ్ సింగ్, రవిశాస్త్రి, కీరాన్ పోలార్డ్, లియో కార్టర్ లాంటి […]

క్రికెట్ మ్యాచ్ ఓ ఓవర్ ఆరు బాల్స్ లో ఆరు వరుస సిక్సర్లు బాదటం లాంటి రికార్డులు అత్యంత అరుదుగా చోటు చేసుకొంటూ ఉంటాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన క్రికెట్ లో ఇప్పటి వరకూ చేతివేళ్ల మీద లెక్కించదగినంత మంది ఆటగాళ్లు మాత్రమే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన మొనగాళ్లుగా నిలిచారు.
ఓవర్లో ఆరు సిక్సర్ల రికార్డును తలచుకోగానే గారీ సోబర్స్, హెర్షల్ గిబ్స్‌ ,యువరాజ్ సింగ్, రవిశాస్త్రి, కీరాన్ పోలార్డ్, లియో కార్టర్ లాంటి దిగ్గజ బ్యాటర్లే గుర్తుకు వస్తారు.

అయితే…ఆరుబాల్స్ లో ఆరు సిక్సర్లు బాదటానికి వయసుతో ఏమాత్రం పనిలేదని పాండిచ్చేరీ టీ-10 లీగ్ లో ఆడుతున్న 15 సంవత్సరాల కుర్రాడు కృష్ణ పాండే చాటుకొన్నాడు.

19 బాల్స్ లోనే 83 పరుగులు

పాండిచ్చేరీ టీ-10 లీగ్ లో భాగంగా పేట్రియాట్స్, రాయల్స్ జట్ల మధ్య జరిగిన ఈ పోరులో తాజాగా ఆరు సిక్సర్ల రికార్డు నమోదయ్యింది. 158 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన రాయల్స్ తరపున క్రీజులో నిలిచిన కృష్ణ పాండే…ప్రత్యర్థి రాయల్స్ బౌలర్ నితీష్ కుమార్ బౌలింగ్ లో పూనకం వచ్చినట్లుగా సిక్సర్‌ షాట్లు బాదాడు.

మొదటి ఐదు బాల్స్ లో ఐదుసిక్సర్లతో చెలరేగిన కృష్ణ పాండే ..వైడ్ ద్వారా లభించిన ఎక్స్ ట్రాబంతిని సిక్సర్ కు పంపడం ద్వారా ఓవర్లో ఆరు సిక్సర్ల రికార్డును పూర్తి చేయగలిగాడు. కృష్ణ పాండే చివరకు 83 పరుగులకు అవుట్ కావడంతో రాయల్స్ జట్టు 3 పరుగుల తేడాతో ఓటమి చవిచూడక తప్పలేదు.

అంతర్జాతీయ క్రికెట్లో…

భారత దేశవాళీ క్రికెట్లో రవిశాస్త్రి 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్ గా రికార్డుల్లో చేరాడు. అయితే ..2007 టీ-20 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ ప్రత్యర్థిగా
సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్…ఫాస్ట్ బౌలర్ క్రిస్ బ్రాడ్ ఓ ఓవర్లో ఆరుకు ఆరు బంతులనూ సిక్సర్లకు పంపడం ద్వారా చరిత్ర సృష్టించాడు.
క్రికెట్ చరిత్రలో ఆరుకు ఆరుబాల్స్ లో సిక్సర్లు సాధించిన ఆటగాళ్లలో గారీ సోబర్స్, రవి శాస్త్రి, హెర్షల్ గిబ్స్, యువరాజ్ సింగ్, రోజ్ విట్లే,అప్ఘాన్ హిట్టర్ జజాయ్ ఉన్నారు.

2007 ప్రపంచకప్ లో యువరాజ్ సింగ్, 2017లో విట్లే, 2018లో జజాయ్ ఆరు సిక్సర్ల రికార్డు నమోదు చేయగా..2020 సీజన్ ప్రారంభంలోనే న్యూజిలాండ్ క్రికెటర్ లియో కార్టర్ అరుదైన ఈ ఘనత సాధించడం విశేషం.

న్యూజిలాండ్ టీ-20 సూపర్ స్మాష్ టోర్నీలో భాగంగా సెంట్రల్ నైట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కాంటర్ బరీ కింగ్స్ తరపున ఆడిన లియో కార్టర్
తన బ్యాటుకు పూర్తి స్థాయిలో పని చెప్పాడు.

లెఫ్టామ్ స్పిన్నర్ ఆంటోన్ డేవసిచ్ బౌలింగ్ ఓ ఓవర్ ఆరుకు ఆరుబాల్స్ లో లియో కార్టర్ భారీషాట్లతో విరుచుకుపడి.. గ్రౌండ్ నలుమూలలకు సిక్సర్ల వర్షం కురిపించాడు.

2021 మార్చి నెలలో శ్రీలంకతో జరిగిన టీ-20 మ్యాచ్ లో స్పిన్నర్ అఖిల ధనంజయ బౌలింగ్ లో విండీస్ కెప్టెన్ కిరాన్ పోలార్డ్ ఆరుకు ఆరు బాల్స్ లో సిక్సర్ల మోత మోగించిన తర్వాత…15 ఏళ్ల కృష్ణ పాండే ఆరు బాల్స్ లో ఆరు సిక్సర్లు నమోదు చేసిన ఆటగాడిగా నిలవటం విశేషం.