ఆరోగ్యకరమైన ఆహారం పేరుతో మనం చేస్తున్న పొరబాట్లు

https://www.teluguglobal.com/h-upload/2023/06/15/500x300_782484-food.webp
2023-06-15 08:40:37.0

ఆరోగ్యకరమైన ఆహారం అనగానే మనకు కొన్నిరకాల ఆహారాలు గుర్తొచ్చేస్తాయి కదా. పళ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, నట్స్ వంటి కొన్ని ఆహారాలు మాత్రమే మనకు మేలు చేస్తాయని అనుకుంటాం.

ఆరోగ్యకరమైన ఆహారం అనగానే మనకు కొన్నిరకాల ఆహారాలు గుర్తొచ్చేస్తాయి కదా. పళ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, నట్స్ వంటి కొన్ని ఆహారాలు మాత్రమే మనకు మేలు చేస్తాయని అనుకుంటాం. అయితే ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకుంటున్నాం… అనుకునేవారు కొన్నిరకాల పొరబాట్లు చేస్తున్నారంటున్నారు పోషకాహార నిపుణులు. కడుపు మాడ్చుకుని కేలరీలు తగ్గించుకోవటం, మనకు బాగా నచ్చిన ఆహారాలను వదిలేయటం లాంటివి ఆరోగ్యకరమని భావించలేమని, వాటివలన సమస్యలు వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. మరి ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో మనం చేస్తున్న పొరబాట్లు ఏమిటో తెలుసుకుందామా…

కొన్ని ఆహారాలను పూర్తిగా మానేయటం…

మంచి ఆహారం తీసుకోవాలనే ఆత్రుతతో కొంతమంది కొన్నిరకాల ఆహారాలను పూర్తిగా మానేస్తుంటారు. ఇప్పుడు చాలామంది వరి అన్నం అసలు ముట్టుకోకూడదని భావిస్తున్నారు. పిండిపదార్థాలు, కొవ్వులను పూర్తిగా తగ్గించాలని అనుకుంటున్నారు. అయితే ఇలా కొన్ని ఆహారాలను పూర్తిగా మానేయటం వలన పోషకాహార లోపం తలెత్తే ప్రమాదం ఉంటుంది.

ఆహారాలను మంచి చెడుగా విభజించడం…

ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలనే తినాలనే ఉద్దేశ్యంతో ఆహారాలను మంచిచెడుగా విడగొట్టి చూస్తుంటాం. పిజ్జాలు, బర్గర్లు వంటివి అసలేమాత్రం మంచివి కాదని, పళ్లు కూరగాయలు వంటివి చాలా మంచివనీ భావించడం వలన మనకు మనమే తినే ఆహారం విషయంలో బలమైన నమ్మకాలు ఏర్పరచుకుంటాం. దీనివలన ఎప్పుడో ఒకసారి తమకు నచ్చిన జంక్ ఫుడ్ వంటివి తినాల్సివచ్చినా చేయకూడని పని చేస్తున్నట్టుగా ఆందోళన కలుగుతుంది. అలాగే పళ్లు కూరగాయలు వంటివి అన్నివిధాలుగా చాలా మంచివి అనే భావనతో ఉండటం కూడా సరికాదు. వాటిని అతిగా తింటూ వాటిపైనే ఆధారపడటం వలన సమస్యలు రావచ్చు.

ఎల్లప్పుడూ తక్కువ కేలరీలున్న ఆహారాలనే తినాలనుకోవటం…

కేలరీలు తక్కువగా ఉన్న ఆహారం చాలామంచిదని, శరీరానికి మేలు చేస్తుందని చాలామంది భావిస్తుంటారు. శరీరానికి అవసరమైన శక్తి ని యూనిట్లలో కేలరీలుగా కొలుస్తారు. మన శరీరం పనిచేయడానికి శక్తి అవసరం. అలాంటప్పుడు ఎప్పుడూ కేలరీలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటూ ఉంటే శరీరానికి తగినంత శక్తి సమకూరదు. దాంతో అలసట, శారీరక సామర్ధ్యం తగ్గిపోవటం, ఆలోచనా శక్తి క్షీణించడం లాంటివి జరగవచ్చు. శక్తి మరీ తగ్గితే రోగనిరోధకశక్తి, కండరాల సాంద్రత తగ్గిపోవటం లాంటి సమస్యలు సైతం తలెత్తవచ్చు.

బాగా ఇష్టపడే ఆహారాన్ని వదిలేయటం …

మంచి ఆహారం తీసుకోవాలనే తపన ఉన్నవారు తమకు నచ్చిన కొన్నిరకాల ఆహారాలను వదిలేస్తుంటారు. కడుపు ఖాళీగా ఉంటే తమకు ఇష్టమైన ఆహారాన్ని తీసుకుంటామేమో అనే భయంతో ఎప్పుడు పొట్టని నిండుగా ఉంచుకుంటారు. ఉదాహరణకు పిజ్జా అంటే ఇష్టమున్న వ్యక్తి బయటకు వెళితే పిజ్జా తినాల్సి వస్తుందేమో అనే భయంతో ముందుగానే ఆరోగ్యకరమని భావించే ఆహారాన్ని ఎక్కువగా తినేస్తాడు. ఆ విధంగా అనవసరంగా ఎప్పుడూ పొట్టనిండుగా తింటూ ఉండాల్సివస్తుంది. అప్పుడప్పుడు తమకు నచ్చిన ఆహారాన్ని తినటం వలన దానిని తినాలనే కోరిక తగ్గుతుంది.

ఎప్పుడూ కొత్త ఆహారాలకోసం వెతుకులాట…

ఇప్పుడు ఎన్నో రకాల కొత్త ఆహార పద్ధతులు మనముందుకు వచ్చేస్తున్నాయి. ఆహారపరిశ్రమకు ఎప్పుడూ మనం తీసుకుంటున్న ఆహారాలు సరైనవనే అభిప్రాయం ఉండదు. నిరంతరం సరికొత్త మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటుంది. అలాగే శరీరంలోని మలినాలను తొలగించుకునే పద్ధతులు కూడా నిరంతరం కొత్తవి వస్తూనే ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనే ఆత్రుతతో మనం ఇలాంటి వాటివెంట పరుగులు తీస్తుంటాం. అందుకే ఇప్పుడు తాత్కాలికంగా బరువుని తగ్గించే ఆహార పద్ధతులను పాటిస్తూ, ఆహారంలో తీవ్రమైన మార్పులు చేసుకుంటూ అనారోగ్యాలకు గురవుతున్నవారు పెరుగుతున్నారు.

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని అనుకునేవారు పైన పేర్కొన్న అంశాలను సైతం గుర్తుంచుకోవటం మంచిది.

Healthy Eating Mistakes,Eating,Food,mistakes,Health Tips
healthy eating mistakes, Food, Health, Telugu News, Telugu Global News, Latest telugu News, tips

https://www.teluguglobal.com//health-life-style/common-mistakes-people-make-while-trying-to-eat-healthy-940484