ఆరో ప్రాణం

2023-01-16 07:10:15.0

https://www.teluguglobal.com/h-upload/2023/01/16/435466-aro-pranam.webp

తెల్లవారు జామున కల

ఆకాశం నిండా అక్షర నక్షత్రాలు

ఆశ్చర్యంలో నేనుండగానే

మాయ కల, మాయం!

లేచి వాకిట్లోకి చూశా

అక్షరాలతో ముస్తాబైన వార్తాపత్రిక

అలవాటుగా అందుకున్నా

కళ్లు అక్షరాల వెంట పరుగులు

చరవాణి మోగింది

తెరవగానే

శుభోదయాక్షరాలు..

ఆత్మీయ పలకరింపులు

కార్యాలయంలో

అక్షర సమాహారాలుగా

లేఖలు..కీలక పత్రాలు

అంతా అక్షరమయమే

సాయం సమయాన

వారపత్రిక స్వాగతించింది

అందమైన అక్షర విన్యాసాలతో

కథలు ..కవితలు..వ్యాసాలు..ఎన్నెన్నో

రాత్రి డైరీలో

నా మోదాలు..ఖేదాలు

ఆశలు.. నిరాశలు

అన్నీ..అన్నీ అక్షర చిత్రాలుగా

అక్షరానుబంధం

అనిర్వచనీయానందం

అక్షయమైన అక్షరం

నా ఆరో ప్రాణం

– జె. శ్యామల

J Shyamala,Telugu Kavithalu