ఆశల సంకల్ప ప్రార్థన 2023

2023-01-01 11:24:09.0

https://www.teluguglobal.com/h-upload/2023/01/01/433485-prakhasa-rao.webp

ఆసుపత్రికి వెళ్లే

అవసరం రాకుండా చూడు!

పోలీసు స్టేషన్ కు వెళ్లే

సమస్య లేకుండా చూడు!

కోర్టు మెట్లెక్కవలసిన

కేసులు రాకుండా చూడు!

ప్రజానాయకుని దగ్గరకువెళ్లే

పని లేకుండా చూడు !

మంత్రిగారిని కలయవలసిన

ముప్పేమీ రాకుండా చూడు!

రౌడీలతో రాజీ పడవలసిన

రోజు రాకుండా చూడు!

దేవునికి

ముడుపులు కట్టవలసిన

కోరిక కలగకుండా చూడు!

పూజలు చేయవలసిన

పాపాలు చేయకుండా చూడు!

యజ్ఞాలు, హోమాలు

చేయవలసిన

ధ్యేయాలు లేకుండా చూడు!

బాబాల దగ్గర

మోసపోవలసినంత

అమాయకత్వం లేకుండా చూడు!

స్వాముల దగ్గరకు

వెళ్ళవలసినంత

అజ్ఞానం లేకుండా చూడు!

మొబైల్ మోసాల మాయలో పడనంత

మెలుకువ ప్రాదించు!

సైబర్ నేరగాళ్ల వలలో పడనంత

ఆలోచన అందించు!

విద్యుక్తధర్మం నిర్వర్తించే

వివేకాన్ని అనుగ్రహించు!

పర్యావరణాన్ని రక్షించే

పట్టుదల ప్రసాదించు!

మూగజీవులకు మమత పంచే

మానవత్వం అనుగ్రహించు!

వసుధైక కుటుంబం కాంక్షించే

విశాలహృదయం ప్రసాదించు!

సమస్యలను ఎదుర్కొనే

సంయమనం అనుగ్రహించు!

సంఘజీవిగా మెలిగే

సంస్కారాన్ని ప్రసాదించు!

విలువలు వెలిగించే

వ్యక్తిత్వాన్ని అనుగ్రహించు!

న్యాయాన్ని నిలబెట్టే

నిబద్ధత ప్రసాదించు!

అన్నార్తులకు అన్నంపెట్టే

అవకాశం అనుగ్రహించు!

అభాగ్యులను ఆదుకునే

సమర్ధత సమకూర్చు!

అక్రమాలను అడ్డుకునే

సంకల్పం ప్రసాదించు!

ఆఖరిక్షణం వరకు

ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా

ఊపిరిపోయే జీవితం

అనుగ్రహించు!

– చంద్రప్రకాశ రావు

Chandra Prakasha Rao,Telugu Kavithalu