ఆసియాకప్ హాకీలో భారత్ కంచుమోత జపాన్ పై 1-0తో గెలుపు

2022-06-01 05:40:25.0

2022 ఆసియాకప్ హాకీ టోర్నీలో భారత్ కంచుమోత మోగించింది. ఇండోనీసియా రాజధాని జకార్తావేదికగా జరిగిన సమరంలో యువఆటగాళ్లతో కూడిన భారతజట్టు బరిలో నిలిచింది. గత ఆసియాకప్ టోర్నీలో బంగారు పతకం సాధించిన భారత జట్టును ప్రస్తుత టోర్నీలో మాత్రం దురదృష్టం వెంటాడింది. గ్రూప్ లీగ్ ఆఖరి పోటీలో ఆతిథ్య ఇండోనీసియాను 16-0 గోల్స్ తో చిత్తు చేయడం ద్వారా మెడల్ రౌండ్లో అడుగుపెట్టిన భారత కుర్రాళ్లు సూపర్ -4 రౌండ్లో స్ఫూర్తిదాయకమైన ఆటతీరును ప్రదర్శించారు. ఓ గెలుపు, […]

2022 ఆసియాకప్ హాకీ టోర్నీలో భారత్ కంచుమోత మోగించింది. ఇండోనీసియా రాజధాని జకార్తావేదికగా జరిగిన సమరంలో యువఆటగాళ్లతో కూడిన భారతజట్టు బరిలో నిలిచింది.

గత ఆసియాకప్ టోర్నీలో బంగారు పతకం సాధించిన భారత జట్టును ప్రస్తుత టోర్నీలో మాత్రం దురదృష్టం వెంటాడింది.

గ్రూప్ లీగ్ ఆఖరి పోటీలో ఆతిథ్య ఇండోనీసియాను 16-0 గోల్స్ తో చిత్తు చేయడం ద్వారా మెడల్ రౌండ్లో అడుగుపెట్టిన భారత కుర్రాళ్లు సూపర్ -4 రౌండ్లో స్ఫూర్తిదాయకమైన ఆటతీరును ప్రదర్శించారు.

ఓ గెలుపు, రెండు డ్రా….

జపాన్, మలేసియా, దక్షిణ కొరియాజట్లతో కూడిన సూపర్ -4 రౌండ్ రాబిన్ లీగ్ పోరులో భారత్ అజేయంగా నిలిచినా గోల్స్ సగటున ఫైనల్స్ కు చేరుకోలేకపోయింది.

జపాన్ తో జరిగిన తొలిపోరులో 2-1 గోల్స్ తో నెగ్గిన భారత్…ఆ తర్వాత దిగ్గజజట్లు మలేసియా , కొరియాలతో జరిగిన పోటీలను డ్రాగా ముగించగలిగింది.

మలేసియాతో పోటీని 3-3 గోల్స్ తోను, దక్షిణ కొరియాతో పోటీని 4-4 గోల్స్ తోనూ ముగించడం ద్వారా 5 పాయింట్లతో కొరియాతో సమఉజ్జీగా నిలువగలిగింది. అయితే..జపాన్ ను 5-0 గోల్స్ తో చిత్తు చేయడం ద్వారా..మెరుగైన గోల్స్ సగటుతో దక్షిణ కొరియా గోల్డ్ మెడల్ రౌండ్ కు అర్హత సాధించడంతో భారత్ చివరకు

కాంస్య పతకం రేసులో మిగిలింది.

జపాన్ కు భారత్ షాక్…

లీగ్ దశలో జపాన్ చేతిలో 2-5 గోల్స్ తేడాతో పరాజయం పొందిన భారతజట్టు..సూపర్ -4 రౌండ్లో 2-1 గోల్స్ తో నెగ్గడం ద్వారా బదులు తీర్చుకొంది. అంతేకాదు..కాంస్య పతకం కోసం జపాన్ తో జరిగిన పోరులోనే 1-0తో మరోసారి విజేతగా నిలిచింది.

హోరాహోరీగా సాగిన కాంస్య పతకం సమరం 7వ నిముషంలోనే రాజ్ కుమార్ పాల్ ద్వారా భారత్ తొలిగోల్ తో 1-0 ఆధిక్యం సాధించింది. ఆ వెంటనే భారత్ కు మరో రెండు పెనాల్టీ కార్నర్ లు లభించినా గోల్స్ గా మలచుకోలేకపోయింది.

మరోవైపు 0-1తో వెనుకబడిన జపాన్ స్కోరు సమం చేయటానికి ఎడతెగనిపోరాటమే చేసింది. భారత గోల్ పైకి నిరంతరదాడులతో జపాన్ సాధించిన పలు పెనాల్టీకార్నర్ లను భారత డిఫెండర్లు వమ్ము చేశారు.

చివరకు ఆట ముగిసేక్షణాలలో జపాన్ కు లభించిన పెనాల్టీకార్నర్ ను భారత డిఫెండర్లు సమర్థవంతంగా అడుకోడం ద్వారా తమజట్టుకు కాంస్య పతకం అందించారు.

మన్ ప్రీత్ సింగ్ తో సహా పలువురు సీనియర్ స్టార్లకు విశ్రాంతినివ్వడం ద్వారా భారత్ పలువురు యువఆటగాళ్లతో ఆసియాకప్ బరిలో నిలిచినా కాంస్య పతకం సాధించడం విశేషం.

ALSO READ : ఒల్డ్ ఈజ్ గోల్డ్ ఆనంద్ టాప్ -10లో హారిక, ఆనంద్

 

2022 Asia Cup hockey,Capital of Indonesia,India wins bronze 1-0 over Japan in Asia Cup Hockey,Jakarta