http://www.teluguglobal.com/wp-content/uploads/2016/02/Age-and-Health-Survey.png
2016-02-13 09:06:06.0
వయసు అనేది ఒక తమాషా అంశం. వయసు పెరగటం అనేది అందరికీ సమానమే అయినా దాన్ని తీసుకునే విధానంలో మాత్రం చాలా తేడాలు ఉంటాయి. కొంతమంది నలభైల్లోనే ఇంకేముంది జీవితం… అనుకుంటే, మరికొందరు అరవైల్లోనూ ఇంకా సాధించాల్సింది చాలా ఉందని అంటుంటారు. పైగా, ఇంకా చేయాల్సింది ఉంది… అనేవారు చాలా చేసి చూపిస్తారు కూడా. అంటే జీవితాన్ని మనం ఎలా చూస్తున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయమన్నమాట. ఫ్రాన్స్‌లోని మాంట్‌పెల్లియర్ యూనివర్శిటీ పరిశోధకులు చేసిన అధ్యయనాల్లో ఈ […]
వయసు అనేది ఒక తమాషా అంశం. వయసు పెరగటం అనేది అందరికీ సమానమే అయినా దాన్ని తీసుకునే విధానంలో మాత్రం చాలా తేడాలు ఉంటాయి. కొంతమంది నలభైల్లోనే ఇంకేముంది జీవితం… అనుకుంటే, మరికొందరు అరవైల్లోనూ ఇంకా సాధించాల్సింది చాలా ఉందని అంటుంటారు. పైగా, ఇంకా చేయాల్సింది ఉంది… అనేవారు చాలా చేసి చూపిస్తారు కూడా. అంటే జీవితాన్ని మనం ఎలా చూస్తున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయమన్నమాట.
ఫ్రాన్స్‌లోని మాంట్‌పెల్లియర్ యూనివర్శిటీ పరిశోధకులు చేసిన అధ్యయనాల్లో ఈ విషయాలు రుజువయ్యాయి. వయసు పెరిగిపోయిందని ఊహించేవారు, అంతే వయసులో ఉన్న ఇతరులకంటే త్వరగా ఆసుపత్రికి వెళతారని వీరి అధ్యయనాల్లో తేలింది. హెల్త్ సైకాలజీ అనే పత్రికలో ఈ వివరాలు ప్రచురించారు. అమెరికాలో దేశవ్యాప్తంగా 10వేలమందిపై 1995నుండి 2013వరకు ఈ విషయంమీద మూడు అధ్యయనాలు నిర్వహించారు. ఈ మూడింటినీ క్రోడీకరించి, విశ్లేషించి చూస్తే తేలిన నిజం ఇది. 24 నుండి 102 వరకు వయసున్న వారిపై అధ్యయనాన్ని నిర్వహించారు.
అధ్యయనం మొదట్లో… అందులో పాల్గొన్నవారు, తమకు ఎంత వయసు ఉన్నట్టుగా భావిస్తున్నారు, వారికి ఏమైనా అనారోగ్యాలు ఉన్నాయా అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పార్టిసిపెంట్స్ లో డిప్రెషన్ లక్షణాలు ఉన్నాయా అనేది పరిశీలించారు. అధ్యయనం ప్రారంభంలో ఎవరైతే తమ అసలు వయసుకంటే పెద్దవారిలా ఫీలయ్యారో వారిలో, రెండు నుండి పదేళ్ల లోపు కాలంలో, 10నుండి 20శాతం వరకు అనారోగ్యాల పాలయ్యే ప్రమాదం పెరిగినట్టుగా గుర్తించారు. మూడు అధ్యయనాల్లోనూ ఇవే ఫలితాలు వచ్చాయి. అంతేకాకుండా వయసు పెరిగిపోయిందనే భావనలో ఉన్నవారు డిప్రెషన్‌కి గురికావడం వలన కూడా హాస్పటల్ బారిన పడుతున్నట్టుగా గుర్తించారు.
వయసు పెరిగిపోయిందని భావించేవారు వ్యాయామాలు చేయడంతో, శరీరాన్ని చురుగ్గా ఉంచే అలవాట్లు అభిరుచులు పెంచుకోవడంతో డిప్రెషన్ రిస్క్‌ని, ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని ఈ అధ్యయన నిర్వాహకులు వెల్లడించారు.
Click on Image for Rakul Preet Singh Stills
Age and Health Survey
https://www.teluguglobal.com//2016/02/13/age-and-health-survey/