ఆ ప్రచారం అత్యంత జుగుప్సాకరం

2024-11-04 11:23:19.0

కారు యాక్సిడెంట్‌ పై స్పందించిన వైఎస్‌ విజయమ్మ

https://www.teluguglobal.com/h-upload/2024/11/04/1374715-ys-vijayamma.webp

ఎప్పుడో తన కారుకు జరిగిన యాక్సిడెంట్‌ పై సోషల్‌ మీడియాలో జరుగుతోన్న ప్రచారం అత్యంత జుగుప్సాకరమని వైఎస్‌ విజయమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో జరుగుతోన్న దుష్ప్రచారం తనను కలచి వేస్తోందన్నారు. తనను అడ్డం పెట్టుకుని నీచ, నికృష్ట రాజకీయాలు చేస్తున్నారని.. వాటిని ఖండించకపోతే ప్రజలు అవే నిజమని నమ్మే ప్రమాదముందనే వివరణ ఇస్తున్నానని తెలిపారు. రెండు రోజుల క్రితం తన కారుకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. ఎప్పుడో జరిగిన ప్రమాదాన్ని తన కుమారుడి పైకి నెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా లబ్ధి పొందాలనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అమెరికాలో ఉన్న తన మనవడి దగ్గరకు వెళ్లినా ఇలాగే తప్పుగా చిత్రీకరించారని, తాను భయపడి విదేశాలకు వెళ్లిపోయినట్టుగా దుష్ప్రచారం చేయడం నీతిమాలిన చర్య అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారి ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఈ నీచ సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనన్నారు. ఇక ముందైనా ఇలాంటి తప్పుడు ప్రచారం, వ్యక్తిత్వ హనన వైఖరిని ఆపితే మంచిదని హితవు చెప్పారు. ఏపీ ప్రజలు కూడా ఈ వికృత చేష్టలను గమనిస్తున్నారని హెచ్చరించారు. సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెప్తారన్నారు. ఇకపై ఇలాంటి అసత్యాలు ప్రచారం చేస్తే తాను చూస్తూ ఊరుకోబోనని తేల్చిచెప్పారు.