ఆ రూ.125 కోట్లు.. ఎవ‌రెవ‌రికి ఎంతెంతంటే..

https://www.teluguglobal.com/h-upload/2024/07/08/500x300_1342523-heres-how-bccis-rs-125-crores-prize-money-will-get-distributed-among-players.webpTelugu Global

రూ.125 కోట్ల బహుమతిని ప్రకటించిన బీసీసీఐ దానికి సంబంధించిన చెక్కును ఇటీవల వాంఖడే స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో జ‌ట్టుకు అందజేసింది.

టీ20 ప్రపంచ కప్‌ విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ ప్రకటించిన రూ.125 కోట్ల నగదు బహుమతిలో ఎవరెవరికి ఎంతెంత అందుతుందనే విషయంలో స్పష్టత వచ్చింది. ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, రిజర్వ్‌ ఆటగాళ్లు, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 42 మంది అమెరికా, వెస్టిండీస్‌ వెళ్లారు.

15 మంది జట్టు సభ్యులతో పాటు ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ ఉన్న విషయం తెలిసిందే. బీసీసీఐ ప్రకటించిన బహుమతిలో వీరంతా ఒక్కొక్కరు రూ.5 కోట్లు చొప్పున అందుకోనున్నారు. ఇందులో మరో విశేషమేమిటంటే.. ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని ఆటగాళ్లు కూడా రూ.5 కోట్లు అందుకుంటారు.

ఇక బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్, ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్, బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రేలకు ఒక్కొక్కరికి రూ.2.5 కోట్లు చొప్పున ఇవ్వనున్నారు. చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ సహా సెలక్షన్‌ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున ఇస్తారు. సహాయక సిబ్బందిలో ముగ్గురు ఫిజియోథెరపిస్టులు, ముగ్గురు త్రోడౌన్‌ స్పెషలిస్టులు, ఇద్దరు మసాజర్లు, స్ట్రెంగ్త్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌లకు ఒక్కొక్కరికి రూ.2 కోట్లు చొప్పున అందజేస్తారు.

రిజర్వ్‌ ఆటగాళ్లుగా వెళ్లిన రింకు సింగ్, శుభ్‌మన్‌ గిల్, అవేశ్‌ ఖాన్, ఖలీల్‌ అహ్మద్‌లకు రూ.కోటి చొప్పున అందజేయనున్నారు. ఇక రూ.125 కోట్ల బహుమతిని ప్రకటించిన బీసీసీఐ దానికి సంబంధించిన చెక్కును ఇటీవల వాంఖడే స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో జ‌ట్టుకు అందజేసింది.

BCCI,Rs 125 crores,Prize money,Distributed,Players,T20 World Cup 2024