ఇంకెన్నిసార్లు మాట తప్పుతారు రేవంత్‌ రెడ్డి!

2025-01-27 06:24:53.0

మాట తప్పడం.. మడమ తిప్పడమే కాంగ్రెస్‌ మార్క్‌ పాలనా? : మాజీ మంత్రి హరీశ్‌ రావు

ఇంకెన్నిసార్లు మాట తప్పుతారు సీఎం రేవంత్‌ రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ‘ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించారు. మాట తప్పడం – మడమ తిప్పడం.. ఇదేనా కాంగ్రెస్ మార్కు పాలనా అని ప్రశ్నించారు. పథకాల అమలులో ఇంకా ఎన్నిసార్లు మాట మార్చుతారు? ఎన్నిసార్లు ప్రజలను మోసం చేస్తారు? అని ప్రశ్నించారు. 2023 డిసెంబర్‌ 9న రుణమాఫీ అని మొదటిసారి మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆగస్టు 15న అని ఇంకోసారి, దసరాకు అని మరోసారి అని చెప్తూ పోయిన ప్రభుత్వం ఈరోజు వరకు 20 లక్షల మందికి రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుబంధు తీసుకుంటే రూ.10 వేలు.. ఆ తర్వాత తీసుకుంటే రూ.15 వేలు వస్తాయని నమ్మించి నిండా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలంలో రైతుభరోసా ఎగవేశారని.. సంక్రాంతికి, జనవరి 26కు ఇస్తామని చెప్పి ఇప్పుడు మార్చి 31 అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ రైతుబంధు ఇచ్చి రైతన్నకు దన్నుగా నిలిస్తే రేవంత్‌ దాన్ని ఎగ్గొట్టి రైతులకు భరోసా లేకుండా చేశారన్నారు. రూ.4 వేల పింఛన్‌, తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2,500, విద్యాభరోసా కార్డు, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి సహా హామీలన్నీ ఇందిరమ్మ రాజ్యంలో ఏమయ్యాయో ఆ ఇందిరమ్మకే తెలియాలని ఎద్దేవా చేశారు.

Congress Party,Telangana Govt,Rythu Barosa,Harish Rao,Revanth Reddy,KCR