ఇంతేరా ఈ జీవితం ( కవిత)

2023-05-11 06:17:12.0

https://www.teluguglobal.com/h-upload/2023/05/11/761380-inthera.webp

గాలి బుడగ రా ఈ జీవితం

తెలుసుకోరా ఈ జీవిత మర్మం

ఏడుస్తూ పుడుతూ ఏడిపించి వెళ్ళేదే దేవుడిచ్చిన జీవితం

ఈ రెండు ఏడుపుల మధ్యదే

నీ కోసం నీదనే జీవితం

ఇంతేరా …. జీవితం

ఈ మాత్రం దానికి

ఎందుకురా సంబురం

నవ్వుతూ , నవ్విస్తూ బ్రతికేయ్ జీవితాంతం

 

” బ్రహ్మచర్యం ”

అంతా మధుర స్మృతుల హరివిల్లు

” గృహస్థ ” వ్యవస్థ

అంతా కుటుంబంతో

సంతోషాల పొదరిల్లు

“వానప్రస్థం” అంతా

బాల్య గృహస్థల తీపిగురుతుల నెమరువేతలు

“సన్యాసం” అంతా పరమాత్మ

పిలుపు కోసం ఎదురు చూపులు  

ఇంతేరా …. జీవితం ,  

ఈ మాత్రం దానికి

ఎందుకురా సంబురం

నవ్వుతూ , నవ్విస్తూ బ్రతికేయ్ జీవితాంతం

 

రోజూ ఏదో… ఇంకేదో సాధించాలని ఉరుకులు పరుగులు

దానికోసం నిత్యం అలుపెరగని పోరాటాలు , ఆయాసాలు

మనిషిగా మానవత్వం లేని మృగానికన్నా హేయమైన పనులు

చివరి రోజుకు వట్టి చేతుల తిరుగు ప్రయాణాలు

ఇంతేరా …. జీవితం ,  

ఈ మాత్రం దానికి

ఎందుకురా సంబురం

నవ్వుతూ , నవ్విస్తూ బ్రతికేయ్ జీవితాంతం

 

గాలి బుడగ లాంటి జీవితం కోసం

జీవమే లేని మర యంత్రంగా మారి

బంధాలు , అనుబంధాలు , బంధుత్వాలు మరచి

విలువలు లేని మనిషిగా మారి

ఆనందం , ఆత్మీయతలకు అర్ధమే తెలియకుండా

చిరు గాలి సవ్వడికి ఆవిరై పోయేదేరా

ఈ జీవితం  

ఇంతేరా …. జీవితం ,  

ఈ మాత్రం దానికి ఎందుకురా సంబురం

నవ్వుతూ , నవ్విస్తూ బ్రతికేయ్ జీవితాంతం

 

ఎవరు నీ తలరాతను రాసేది…  

ఎవరు నీకు మార్గం చూపేది….

దివ్యత్తాన్ని నమ్ముతూ …  

రాసుకో నీ రాతను

జీవిస్తూ మరణించకు

నీకంటూ , నీదంటూ

చివరిగా నీకు మిగిలేది

కాదు….. నువ్వు బ్రతికిన సంవత్సరాలది

అవును ….. ఆస్వాదించిన

మధుర అనుభవాలది….  

 

ఇంతేరా …. జీవితం…..!!

– భీమా శ్రీనివాసరావు

Inthera ee jeevitham,Telugu Kavithalu,Bhima Srinivasa Rao