2025-01-10 14:15:28.0
రుణమాఫీపై ఫ్లెక్సీలతో ప్రచారం చేయండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఇందిరమ్మ కమిటీలు ఓకే అంటేనే సంక్షేమ పథకాలు అందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం సెక్రటేరియట్ లో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26వ తేదీ నుంచి నాలుగు కీలక పథకాలను అమలు చేయాలని నిర్ణయించిందన్నారు. ఇందుకు భారీగా ఖర్చవుతున్నా అమలు చేస్తున్నామని.. పేదలకు మేలు చేసే ఈ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలను భాగస్వామ్యం చేయాలన్నారు. రైతభరోసా, ఇందిరమ్ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపికలోనూ ఇందిరమ్మ కమిటీలను తప్పనిసరిగా సంప్రదించాలని తేల్చిచెప్పారు. ఇందిరమ్మ కమిటీలు, జిల్లాల ఇన్‌చార్జీ మంత్రులతో చర్చించిన తర్వాతే లబ్ధిదారులను ప్రకటించాలన్నారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వివరాలను అన్ని గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా ప్రకటించాలన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటికే రూ.22 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిందని ఆ వివరాలను ప్రతి గ్రామంలోనూ ఫ్లెక్సీలు ప్రదర్శించి ప్రచారం చేయాలన్నారు. ఈ నాలుగు పథకాల అమలుకు సమగ్ర మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు ఇవ్వబోతున్నామని.. ఆ ఉత్తర్వులకు అనుగుణంగానే లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. ఈ నాలుగు పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు.
Indiramma Committees,Rythu Barosa,Ration Cards,Inidramma Indlu,Athmeeya Barosa,Bhatti Vikramarka,Collectors Conferance