ఇక్కడ అద్భుతాలు కొలువుదీరాయి

https://www.teluguglobal.com/h-upload/2022/11/18/500x300_426690-wonders.webp
2022-11-18 12:25:58.0
35అడుగుల స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ. ఏదో తేడాగా అనిపిస్తోందా! స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ ఎత్తు 150 అడుగులకు పైగానే అని చదివిన గుర్తు వస్తోందా? మీరే కరెక్ట్‌. అమెరికా, న్యూయార్క్‌ నగరం, లిబర్టీ ఐలాండ్‌లో ఉన్న స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ ఎత్తు అదే. మరి… ఈ 35 అడుగుల స్టాచ్యూ ఎక్కడ ఉంది? మనదేశంలోనే ఉంది.

అమెరికా నుంచి స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ

బ్రెజిల్‌ నుంచి క్రైస్ట్‌ ద రీడీమర్‌

పారిస్‌ నుంచి ఈఫిల్‌ టవర్‌

ఆగ్రా నుంచి తాజ్‌మహల్‌

రోమ్‌ నుంచి కలోజియం

పిసా నుంచి లీనింగ్‌ టవర్‌

గిజా నుంచి పిరమిడ్‌

అన్నీ మన ముందుకు వచ్చాయి.

35అడుగుల స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ. ఏదో తేడాగా అనిపిస్తోందా! స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ ఎత్తు 150 అడుగులకు పైగానే అని చదివిన గుర్తు వస్తోందా? మీరే కరెక్ట్‌. అమెరికా, న్యూయార్క్‌ నగరం, లిబర్టీ ఐలాండ్‌లో ఉన్న స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ ఎత్తు అదే. మరి… ఈ 35 అడుగుల స్టాచ్యూ ఎక్కడ ఉంది? మనదేశంలోనే ఉంది. ఇదొక్కటే కాదు, ప్రపంచంలోని ఏడు వింతలూ ఒకే చోట ఆవిష్కారమైన థీమ్‌ పార్క్‌. అది న్యూఢిల్లీలో ఉన్న వేస్ట్‌ టు వండర్‌ థీమ్‌ పార్క్‌. ఈ థీమ్‌ పార్క్‌ న్యూఢిల్లీ శివారున నిజాముద్దీన్‌ లో ఉంది. నిజాముద్దీన్‌ మెట్రోస్టేషన్‌లో దిగితే నడకదూరమే.

సైకిల్‌ చైన్‌నూ వదల్లేదు!

పాత సైకిళ్ల విడిభాగాలు, లోహపు ఫలకాలు, చైన్‌లతో చేసిన లిబర్టీ స్టాచ్యూ ఉంది. క్రైస్ట్‌ ద రీడీమర్‌ విగ్రహంలో ఆటోమొబైల్‌ పరిశ్రమ వ్యర్థాలు ఇడిమిపోయాయి. 70 అడుగుల ఈఫిల్‌ టవర్‌లో వాహనాల విడిభాగాలు కనిపిస్తాయి. ఇక మనదేశంలోని అద్భుతం తాజ్‌మహల్‌ నిర్మాణంలో పార్కుల్లో వాడి పాడైపోయిన బెంచిలు, పైపులు, జల్లెడవంటి ఊయల భాగాలున్నాయి. పాడైపోయిన ఎలక్ట్రిక్‌ పోల్స్, మెటల్‌ రెయిలింగ్‌లు రోమన్‌ కలోజియమ్‌లో దాక్కున్నాయి. సైకిల్‌ రిమ్ములు, పరిశ్రమల్లో ఉపయోగించిన మెటల్‌ షీట్‌లు లీనింగ్‌ టవర్‌ ఆఫ్‌ పిసాకు ఆసరా అయ్యాయి. ఇక చివరగా గిజా పిరమిడ్‌ అదీ ఇదీ అనే తేడా లేకుండా రకరకాల సైజుల్లో ఉన్న ఇనుప దిమ్మలు ఒకదాని మీద ఒకటి అమరిపోయాయి.

చెట్లున్నాయి

వ్యర్థాల నుంచి అద్భుతాల ఆవిష్కరణ అన్నమాట. పిల్లలకు చూపించి తీరాల్సిన ప్రదేశం. రెండు గంటల సమయాన్ని కేటాయించుకుంటే శ్రద్ధగా పరిశీలించి ఆస్వాదించవచ్చు. ఎంట్రీ టికెట్‌ పెద్దవాళ్లకు 50, పిల్లలకు 25 రూపాయలు. ఉదయం పదకొండు నుంచి రాత్రి పదకొండు వరకు తెరిచి ఉంటుంది. రాత్రి వెళ్తే లైటింగ్‌లో చూడవచ్చు. కానీ పగలు వెళ్లడమే సౌకర్యం. పార్క్‌ లోపల తినడానికి ఏమీ దొరకదు. వెంట తీసుకువెళ్లాల్సిందే. ఈ ఏడు వింతల నమూనాలతోపాటు ప్రకృతి సహజత్వాన్ని కూడా నగరం మధ్యలో ఆవిష్కరించారు. అడవి, అడవిలో కాలువలు, చెట్లు, చెట్టు కొమ్మల మీద కూర్చుని తొంగి చూస్తున్నట్లున్న జంతువుల బొమ్మలను పిల్లలు బాగా ఎంజాయ్‌ చేస్తారు.

Statue of Liberty,Waste to Wonder Park