2024-10-28 05:11:55.0
ఆ ఖాతాను రెండు రోజులకే సస్పెండ్ చేసిన ‘ఎక్స్’
ఇరాన్‌పై గత వారం ఇజ్రాయెల్ చేసిన దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమయ్యాయి. ఆ దాడుల్లో టెహ్రాన్‌కు భారీ నష్టాన్ని కలిగించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీ తన కొత్త సోషల్ మీడియా ఖాతాలో చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్‌ను బెదిరిస్తూ ఆయన పోస్ట్ చేశారు. దీంతో ఆ ఖాతాను రెండు రోజులకే ‘ఎక్స్’ సస్పెండ్ చేసింది.
ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుని గత వారం ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత ఖమేనీ హిబ్రూ భాషలో ఒక ఎక్స్ ఖాతాను తెరిచారు. అందులో ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తూ సీరియస్ పోస్ట్ పెట్టారు. ఇరాన్‌ను తక్కువ అంచనా వేసి జియోనిస్టు పాలన తప్పు చేసింది. ఇరాన్‌కు ఎలాంటి శక్తి సామర్థ్యం, చొరవ, కోరిక ఉందో మేం చూపిస్తాం’ అని రాసుకొచ్చారు. దీందో ఈ ఖాతాను మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ ఆదివారం రాత్రి సస్పెండ్ చేశారు. అయితే ఖమేనీ పేరుతో ఉన్న మరో అధికారిక ఖాతా మాత్రం యథావిధిగా కొనసాగుతుండటం విశేషం.
ఖమేనీ ఆరోగ్యం క్షీణించినట్లు వార్తలు
మరోవైపు ఖమేనీ ఆరోగ్యం ఇటీవల క్షీణించినట్లు వార్తలు వచ్చాయి. గత వారం ఆయన తీవ్రమైన కడుపునొప్పి, జ్వరంతో బాధపడ్డారు. దీంతో ఆయన అధికారిక నివాసంలోనే అత్యాధునిక వైద్యసౌకర్యాలు అమర్చి ఆయన పేగుకు వైద్యులు శస్త్రచికిత్స చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కొంత మెరుగైందని, ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారని ఇరాన్ మీడియా కథనాలు వెల్లడించాయి.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించిన ఈజిప్ట్
పాలస్తీనా ఖైదీలను, ఇజ్రాయెల్ బందీలను పరస్పరం మార్చుకోవడానికి వీలు కల్పించేలా ఇజ్రాయెల్- హమాస్ ఒప్పందం చేసుకోవడానికి రెండు రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఈజిప్ట్ ప్రతిపాదించింది. ఈ చర్య ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఏడాది కాలంగా ఉద్రిక్తతలు చల్లార్చడానికి ఉపయోగపడుతుందని ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి పేర్కొన్నారు. అయితే దీనిపై ఇజ్రాయెల్, హమాస్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని వెల్లడించారు.
Zionist regime,Made a mistake,Khamenei,Tweets in Hebrew,X suspends account