ఇది సంవిధాన్‌.. సంఘ్‌ రూల్‌ బుక్‌ కాదు

2024-12-13 08:57:39.0

రాజ్యాంగంపై చర్చ సందర్భంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై విరుచుకుపడిన ప్రియాంక

https://www.teluguglobal.com/h-upload/2024/12/13/1385505-priyanka.webp

భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 75 వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరుగుతున్నది. ఇందులో విపక్షాల తరఫున కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా చర్చను ప్రారంభించారు. ఎంపీగా ఇటీవలే పార్లమెంటులో అడుగుపెట్టిన ఆమె లోక్‌సభలో ప్రసంగం చేయడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికార బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై విమర్శలు చేశారు. రాజ్యాంగం అంటే సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉద్దేశిస్తూ) బుక్‌ కాదని ధ్వజమెత్తారు.

దేశంలో జరిగే అన్నిటికీ నెహ్రూనే కారణమా?

బీజేపీ ఎప్పుడూ గతం గురించే మాట్లాడుతుంది. కానీ దేశ ప్రగతి కోసం ఇప్పుడేం చేస్తున్నారో వారు మాట్లాడాలి. దేశంలో జరిగే అన్నిటికీ నెహ్రూనే కారణమా? నెహ్రూ పేరును, ఆయన ప్రసంగాలను మీరు పుస్తకాల నుంచి తొలిగించగలరేమో.. కానీ స్వతంత్య్ర పోరాటంలో, జాతి నిర్మాణంలో ఆయన పాత్రను చెరిపేయలేరు అని ప్రియాంక కౌంటర్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా 2017 లో జరిగిన ఉన్నావ్‌ అత్యాచార ఘటనను ఆమె ప్రస్తావించారు. ఇలాంటి ఘటనల్లో బాధితులకు పోరాడే హక్కును రాజ్యాంగమే కల్పించిందన్నారు.

అన్నీ ఆయనకే ఇస్తున్నారని ఆగ్రహం

ఈ సందర్భంగా అదానీ వ్యవహారంపై కాంగ్రెస్‌ ఎంపీ పరోక్షంగా విమర్శలు చేశారు. ఒక్కరిని కాపాడటం కోసం 142 కోట్ల మంది భారతీయుల ప్రయోజనాలను విస్మరిస్తున్నారు. సంపద, రోడ్లు, పోర్టులు, గనులు అన్నీ ఆయనకే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల తరఫున పోరాడే విపక్షాల గళాన్ని అణిచివేయడానికి తప్పుడు కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసి విపక్ష నేతలపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

మెజారిటీ వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేవారు

ఇతర దేశాలతో పోలిస్తే మన స్వాతంత్య్ర పోరాటం ప్రత్యేకమైంది. సత్యం, అహింస అనే పునాదులపైనే మనం పోరాడాం. మన స్వాతంత్య్ర ఉద్యమం ప్రజాస్వామ్య గళం. దాన్నుంచి ఉద్భవించినదే రాజ్యాంగం. ఇది కేవలం డాక్యుమెంట్‌ కాదు.. అంబేద్కర్‌, మౌలానా ఆజాద్‌, రాజగోఆపలచారి, నెహ్రూ వంటి ఎంతో మంది నేతలు ఎన్నో ఏళ్ల పాటు తమ జీవితాలను అంకితం చేసి దీన్ని రూపొందించారు. ప్రజా హక్కులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తే శక్తిని రాజ్యాంగం మనకు కల్పించింది. ఇది దేశ ప్రజలను కాపాడే సురక్షా కవచంలా ఉన్నది. అయితే దీన్ని బద్దలు కొట్టేందుకు అధికార ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. గత ఐదేళ్లలో ఈ రక్షణ కవచాన్ని బలహీనపరిచింది. లేట్రల్‌ ఎంట్రీ, ప్రైవేటీకరణ వంటి చర్యలతో రిజర్వేషన్లను బలహీనపరచడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది. లోక్‌సభలో ఎక్కువ మెజారిటీ వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చాలని ఎన్డీఏ భావించింది. అది జరగకపోవడంతో ఆ ప్రతిపాదనలపై వెనక్కి తగ్గింది. ఇది సంవిధాన్‌.. సంఘ్‌ రూల్‌ బుక్‌ కాదు అని కాంగ్రెస్‌ ఎంపీ దుయ్యబట్టారు. కులగణన జరగాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు. 

75 years of the Constitution began,Lok Sabha Debate,Congress MP Priyanka Gandhi,Fire on BJP and RSS,Opposition Seeks Caste Census