ఇరాక్‌లో జగిత్యాల వాసి నరకయాతన

2024-10-08 03:41:35.0

ఏజెంట్‌ మాటలు నమ్మి విదేశాలకు వెళ్తే రూమ్‌లో బంధించారంటూ పల్లపు అజయ్‌ సెల్ఫీ వీడియో

ఎక్కువ జీతం వస్తుందని ఏజెంట్‌ మాటలు నమ్మి విదేశాలకు వెళ్తే రూమ్‌లో బంధించారంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియోల ఆవేదన వ్యక్తం చేశాడు.జగిత్యాల జిల్లా సారంగాపూర్‌కు చెందిన పల్లపు అజయ్‌ 14 నెలల కిందట రూ. 2.70 లక్షలు కట్టి ఇరాక్‌ దేశానికి వెళ్లాడు. అజయ్‌కి ఉపాధి కల్పించాలని ఏజెంట్‌ ఇరాక్‌లో ఇతరులకు అప్పగించాడు. వారి పని కల్పించకుండా అతని పాస్‌పోర్టును తీసుకున్నారు. భాష రాక, బైటికి పోలేక రూమ్‌లోనే ఉంటున్నట్లు తల్లిదండ్రులు రాధ-గంగయ్యకు సమాచారం ఇచ్చారు. ఐదు నెలల కిందట ఏజెంట్‌ ఇండియాకు వచ్చాడు. అజయ్‌ తల్లిదండ్రులు అతన్ని నిలదీయడంతో రూ. లక్ష వెనక్కి ఇచ్చాడు. వారు ఆ డబ్బును అజయ్‌కి పంపించారు. స్వదేశానికి రావడానికి పాస్‌పోర్ట్‌ లేదని తల్లిదండ్రులకు చెప్పడంతో నెల కిందట మరో రూ. 66 వేలు పంపారు. పస్తులతో ఇబ్బందులు పడుతున్నానంటూ అజయ్‌ సెల్ఫీ వీడియో పంపడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ కొడుకును స్వదేశానికి తీసుకురావాలని వారు వేడుకుంటున్నారు. 

Selfie video,pallapu Ajay,Agent fraud,Sarangapur of Jagityala District