ఇలాగైతే కూట‌మి ప్ర‌భుత్వం కూలడం ఖాయం

2024-07-22 04:14:38.0

తాము సచ్చీలులమని ప్రకటించుకున్న కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చిన వెంటనే విధ్వంసకర పాలన సాగిస్తున్నారని తులసిరెడ్డి మండిపడ్డారు.

https://www.teluguglobal.com/h-upload/2024/07/22/1346147-congress-leader-tulsi-reddy-said-that-the-collapse-of-the-alliance-government-in-ap-is-certain.webp

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ గాడి తప్పిందని, రోజూ ఏదో ఒక హింసాత్మక ఘటన జరుగుతుండటం కలవరపాటుకు గురిచేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ తులసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఐదు నెలల్లోనే కూటమి ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని ఆయన హెచ్చరించారు. తిరుపతిలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ వారిని అభాసుపాలు చేసి.. తాము సచ్చీలులమని ప్రకటించుకున్న కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చిన వెంటనే విధ్వంసకర పాలన సాగిస్తున్నారని తులసిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంత దారుణాలు జరుగుతున్నా బీజేపీ మాత్రం కూటమితో అంటకాగుతూ చోద్యం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం టీడీపీపై ఆధారపడి ఉందని, ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించుకునేందుకు ఇది సరైన సమయమని తులసిరెడ్డి గుర్తుచేశారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో వారికి ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు.