ఈటల‌కు బీజేపీలో తన స్థానమేంటో తెలిసొచ్చిందా ?

2022-06-30 01:06:11.0

తెలంగాణ బీజేపీలో వర్గ పోరు తీవ్ర స్థాయికి చేరిందని కొంత కాలంగా వినిపిస్తున్న వార్తలు. ఆ పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశం సందర్భంగా ఆ పోరు పీక్ కు చేరిందని కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య కొద్ది రోజులుగా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. రాబోయే ఎన్నికల్లో తామే గెలుస్తామని అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు కావాలన్న అంశంపై ఒకరిపై ఒకరు ఎత్తులు పై […]

తెలంగాణ బీజేపీలో వర్గ పోరు తీవ్ర స్థాయికి చేరిందని కొంత కాలంగా వినిపిస్తున్న వార్తలు. ఆ పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశం సందర్భంగా ఆ పోరు పీక్ కు చేరిందని కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య కొద్ది రోజులుగా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.

రాబోయే ఎన్నికల్లో తామే గెలుస్తామని అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు కావాలన్న అంశంపై ఒకరిపై ఒకరు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. ప్రస్తుతం ఆ పోరులో బండి సంజయ్ పై చేయి సాధించారా ?

హైదరాబాద్ లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనే ప్రతినిధిల్లో ఈటల‌ రాజేందర్ ను లేకుండా చేయడంలో బండి విజయం సాధించారు. ఆయనతో పాటు తనకు పోటీగా వస్తాడనుకుంటున్న మరో ఎమ్మెల్యే రఘునందన్ రావును కూడా సమావేశాలకు హాజరు కాకుండా చేయగలిగారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కాబట్టి ఆయనను ఏం చేయలేకపోయార‌నే వాదనలు వినపడుతున్నాయి.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, వివేక్, జితేందర్ రెడ్డి, రాజా సింగ్, మంత్రి శ్రీనివాస్, గరికపాటి మోహన్ రావు, లక్ష్మణ్, విజయశాంతిలకు మాత్రమే అవకాశం దక్కింది.

కొద్ది రోజుల క్రితమే ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో చర్చలు జరిపి పూర్తి ధీమాతో హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఈటల రాజేందర్ ఈ పరిణామంతో హతాశుడైనట్టు తెలుస్తోంది. ఈ విషయంపై రఘునందన్ రావు కూడా అసంత్రుప్తిగా ఉన్నట్టు సమాచారం తోటి ఎమ్మెల్యే రాజా సింగ్ ను సమావేశాలకు ఆహ్వానించి తమను ఆహ్వానించకపోవడం పట్ల ఈటల, రఘునందన్ లు కుతకుతలాడుతున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలోని బీజేపీ నాయకులందరిలోకి అత్యంత ప్రజా బలమున్న నాయకుడిని తానే అన్న నమ్మకం ఎక్కువగా ఉన్న ఈటలకు బీజేపీ నాయకత్వం ఆయన స్థానమేంటో చూపించిందని సంజయ్ అనుచరులు చెప్తున్నారు.

నిజంగానే బీజేపీలో ఈటల రాజేందర్ అసలు స్థానం అదేనా ? ఒకప్పుడు టీఆరెస్ లో నెంబర్ 2 గా వెలుగు వెలిగిన ఈటల రాజేందర్ దీనిని దిగమింగుకోవడం కష్టమే కదా !

 

bandi sanjay,BJP,BJP National Executive Meeting,etala Rajender,Narendra Modi,raghunandan rao,Telangana,TRS