ఈ గాలి చేష్టలు (కవిత)

2023-11-11 02:43:19.0

https://www.teluguglobal.com/h-upload/2023/11/11/854603-gali.webp

అప్పటివరకు తమ కొమ్మలలో దాచినట్లున్న సూర్యుడిని

తరువులు

సమయమైనదని సాగనంపుతున్నట్లున్నది.

రాధామనోహరం చెట్టొకటి,

కొన్ని పూలను ఆ గాలితో పంపింది పరిచయస్తులతో పంపినట్లు.

ఓ పిల్ల తెమ్మెర చిలిపిగా,

నను తాకి ముంగురులనూపింది.

స్వేదబిందువు,

తనకోసమే ఎదురుచూసినట్లు,

తనతో కలిసి మాయమైనది.

గాలికి జాజిపువ్వొకటి

నే చూసేట్లుగా రాలి,

ఎ(హ)త్తుకొమ్మని గోములుపోయింది.

రోటికి(రోలు) కొన్ని బాదం ఆకులు రాలి ఆచ్ఛాదనలైనాయి.

చిరకాలం గాలినిచ్చి

తన సేవలనందించిన

కొబ్బరిమట్టొకటి

పదవి విరమించాలనుకుందేమో, నేలను చేరి విశ్రాంతినొందింది.

పొద్దెక్కినదని,

బామ్మగారు పెట్టిన వడియాలలో

ఆరినవి కొన్ని,

కుదురుగా ఉండని కుర్రాళ్ళలా

ఈ గాలికి దూరంగా ఎగిరివెళ్ళి ఆడుకుంటున్నవి.

అందాలను నేరుగా తాకాలనుకున్న కొంటెగాలి,

ఓణీని నెట్టివేయలేక ఓడిపోయింది.

ఏకాంతంలో కొత్తజంట తనూవల్లరీద్వయిని,

చిలిపి గాలి ఓమారు తాకి వెళ్ళింది.

సిద్ధవైద్యునిలా

ఓ మూలనుంచి,

కానుగచెట్టు గాలితో చికిత్స చేస్తున్నది.

కన్నియొక్కత్తె తలంటుకుని విరబోసుకున్న శిరోజాలలా

మల్లెకొమ్మలు మొగ్గలతో పరుచుకుని పంచిన వింతపరిమళాన్ని

గాలి మోసుకొచ్చింది.

వెరసి ఈ చెట్ల గాలిలో

ఓ పరిమళం, ఔషధగుణం, కొత్తదనం, కొంటెదనం, గడుసుదనం కలబోసి మురిపిస్తున్నది.

– ముత్తుశ్రీ. (కందుకూరు)

Telugu Kavithalu