2025-02-12 08:28:57.0
ఉచితంగా రేషన్, డబ్బు ఇస్తుంటే.. పనిచేయడానికి ఇష్టపడటం లేదని పేర్కొన్న అత్యున్నత న్యాయస్థానం
https://www.teluguglobal.com/h-upload/2025/02/12/1402755-supreme-court.webp
పార్టీల ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి మంచిది కాదని అభిప్రాయపడింది. ఉచితంగా రేషన్, డబ్బు ఇస్తుంటే.. పనిచేయడానికి ఇష్టపడటం లేదని పేర్కొన్నది. ఉచితాల కారణంగా ప్రజలు మొగ్గు చూపడం లేదని తెలిపింది. పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఉచితాలపై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఉచిత పథకాలు మంచివి కావు. దురదృష్టవశాత్తూ.. వీటి కారణంగా ప్రజలు కష్టపడి పనిచేయడానికి ఇష్టపడటం లేదు. ఉచితంగా రేషన్, డబ్బులు అందుతున్నాయి. ఎలాంటి పని చేయకుండానే డబ్బులు వస్తుండటంతోనే ఇలా జరుగుతున్నది. ప్రజలకు సౌకర్యాలు అందించాలన్న ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే. కానీ వారిని దేశాభివృద్ధిలో భాగం చేయాలి. ఉచితాల ద్వారా అలా జరుగుతున్నదా? ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి సరైనది కాదని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కేంద్ర ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన మిషన్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నదని… నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు పలు సమస్యలు పరిష్కరించడానికి యోచిస్తున్నదని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి ఈ సందర్భంగా ధర్మాసనానికి తెలిపారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. ఈ నిర్మూలన మిషన్ ఎంత కాలం పాటు పనిచేస్తుందో తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్‌ను మరో ఆరు వారాల తర్వాత విచారిస్తామని వాయిదా వేసింది.
Supreme Court,Key Comments,On Free Schemes,Due to Free ration &Money,Not willing to work