ఉప్పుని మరీ తగ్గించడం… ముప్పు

https://www.teluguglobal.com/h-upload/2023/10/08/500x300_837406-reducing-salt.webp
2023-10-08 13:52:43.0

ఉప్పుని ఎక్కువగా తీసుకుంటే అది ఆరోగ్యానికి చెడు చేయటం నిజమే అయినా ఉప్పుని మరీ తగ్గించి తీసుకోవటం కూడా మంచిది కాదు. అలా చేసినా ఆరోగ్యానికి నష్టం జరుగుతుంది.

సినీనటి శ్రీదేవి తెరపై అందంగా కనిపించడం కోసం ఉప్పులేని ఆహారం తీసుకునేదని, తనకు లోబీపి సమస్య ఉండటం వలన వైద్యులు ఉప్పుని మానేయటం మంచిది కాదని చెబుతున్నా ఆమె పట్టించుకునేది కాదని… ఇటీవల ఆమె భర్త బోనీ కపూర్ చెప్పుకొచ్చారు. ఉప్పు శరీరంలో నీటిని నిలిచి ఉండేలా చేస్తుంది… దాంతో మొహం ఉబ్బినట్టుగా కనబడుతుందనే ఉద్దేశ్యంతో చాలామంది మహిళలు ఉప్పుని మానేస్తుంటారని వైద్యులు చెబుతున్నారు.

ఉప్పుని ఎక్కువగా తీసుకుంటే అది ఆరోగ్యానికి చెడు చేయటం నిజమే అయినా ఉప్పుని మరీ తగ్గించి తీసుకోవటం కూడా మంచిది కాదు. అలా చేసినా ఆరోగ్యానికి నష్టం జరుగుతుంది. ఉప్పుని మరీ తగ్గిస్తే కలిగే నష్టాలను గురించి తెలుసుకుందాం…

ఉప్పుకి శరీరం స్పందించే తీరు అందరిలో ఒకేలా ఉండదని, అది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యక్తుల వయసు, బాడీ మాస్ ఇండెక్స్, వారు జన్మించిన జాతి తెగ లాంటి అంశాలు, కుటుంబ సభ్యుల్లో బీపి తీరు… లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉప్పు… వ్యక్తుల శరీరాలపై ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా మనం రోజుకి అయిదు గ్రాముల వరకు ఉప్పుని తీసుకోవచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెబుతోంది.

ఉప్పుని మరీ ఎక్కువగా కాకుండా మితంగా వాడటం అవసరమే అయినా దానిని పూర్తిగా తగ్గించడం కూడా మంచిది కాదు. ఉప్పుని ఎక్కువగా వాడితే అధిక రక్తపోటు, గుండె వ్యాధులు, స్ట్రోక్ లాంటి ప్రమాదాలకు దారితీయవచ్చు. అలాగే ఉప్పుని పూర్తిగా తగ్గించినా ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది.

ఉప్పుని పూర్తిగా ఎందుకు మానేయకూడదు?

ఉప్పులో ఉండే ప్రధానమైన అంశం సోడియం. మన శరీరానికి అవసరమైన అతి ముఖ్యమైన ఖనిజాలలో ఇది కూడా ఒకటి. సోడియం మన శరీరానికి ఆరోగ్యపరంగా ఎన్నోరకాల లాభాలను అందిస్తుంది. కణాల పనితీరుకి, శరీరంలో ద్రవాల నిర్వహణకు, ఎలక్ట్రోలైట్ లు సమతౌల్యంలో ఉండటానికి సోడియం కావాలి. క్యాల్షియం, క్లోరైడ్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియంలు సాధారణ ఎలక్ట్రోలైట్ లు. ఇవన్నీ మనం తీసుకునే ఆహారం, ద్రవాల ద్వారా మనకు అందుతుంటాయి.

శరీరంలో ఎలక్ట్రోలైట్లు సమతౌల్యంలో లేకపోతే… మన ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంటుంది. అందుకే సాధారణ ఆరోగ్యంతో ఉన్నవారు, మూత్రపిండాలు, గుండెకు సంబంధించిన సమస్యలు లేనివారు ఉప్పుని పూర్తిగా తగ్గించడం మంచిది కాదు. మధుమేహం, అధిక రక్తపోటు లాంటి సమస్యలతో బాధపడుతున్నవారికి మాత్రమే తక్కువ ఉప్పుని తీసుకోవటం వలన లాభం ఉంటుంది. వైద్య సలహా లేకుండా ఉప్పుని బాగా తగ్గించేస్తే అది హైపోనేట్రీమియా అనే సమస్యకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.

హైపోనేట్రీమియా అంటే…

శరీరంలో సోడియం బాగా తగ్గిపోతే ఏర్పడే పరిస్థితి ఇది. ఈ పరిస్థితిలో శరీరంలో కండరాలు, కణాలు వాపుకి గురవుతాయి. అలాగే రక్తపోటుపై ప్రభావం పడుతుంది. రోజుకి 2.4 గ్రాముల కంటే తక్కువగా ఉప్పుని తీసుకోవటం వలన, సోడియం తగ్గిపోయి… మూత్రపిండాలు ఉప్పుని బయటకు పంపకుండా నిలిపి ఉంచుతుంటాయి. ఇలాంటప్పుడు ఎలక్ట్రోలైట్ల అసమతౌల్యత ఏర్పడి కళ్లు తిరగటం, తలనొప్పి, అలసట, మగత లాంటి లక్షణాలు ఉంటాయి.

పిండిపదార్థాలను పూర్తిగా ఆపేసి ప్రొటీన్లు, కొవ్వులు ఉన్న కీటో డైట్ ని తీసుకునేవారిలో సోడియం స్థాయిలు తగ్గిపోయి మగత కమ్మినట్టుగా అనిపించవచ్చు. హైపోనేట్రీమియా తక్కువగా లేదా మధ్యస్థ స్థాయిలో ఉంటే ఆ వ్యక్తికి అలసట, తలనొప్పి, వికారం, మగత, గందరగోళం, వాంతులు, శక్తి లేకపోవటం, కండరాల బలహీనత, నొప్పులు లాంటి సమస్యలు ఉండవచ్చు. ఇదే సమస్య మరీ తీవ్రంగా ఉంటే అది మూర్చ, కోమా, మెదడు గాయపడటం లాంటి సమస్యలకు దారితీయవచ్చు. కనుక ఉప్పు విషయంలో వైద్యుల సలహా లేకుండా సొంత నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు.

Salt,Health Tips,Reducing Salt
salt, Health, health tips, reducing salt benefits, reducing salt

https://www.teluguglobal.com//health-life-style/reducing-salt-too-much-a-threat-966453