ఎంజీఆరే నాకు నిత్య స్ఫూర్తి

2024-10-17 07:20:59.0

అన్నాడీఎంకే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు

https://www.teluguglobal.com/h-upload/2024/10/17/1369845-pawan.bmp

అన్నాడీఎంకే పార్టీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్‌ చేశారు. ఎంజీ రామచంద్రన్‌ (ఎంజీఆర్‌) ఈ పార్టీని స్థాపించి తమిళనాడులో తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగారన్నారు. పేదలు, అన్నార్థులకు సాయం చేశారని.. వారికి హుందాగా జీవించే హక్కును కల్పించారని కితాబు ఇచ్చారు. ఆయన పాలనలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమానంగా చేపట్టారని.. తమిళనాడును దేశంలో సుసంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దారని అన్నారు.

ప్రజల వర్తమాన అవసరాలను తీర్చడంతో పాటు దీర్ఘకాలిక భవిష్యత్తు, స్థిరాభివృద్ధి కోసం ఎంజీఆర్‌ గొప్ప పునాది వేశారు. ప్రజలు, పాలన పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధిని చూసి నేను స్ఫూర్తి పొందాను. ఎంజీఆర్‌ తర్వాత ఆయన ఆశయాలు, నాయకత్వాన్ని జయలలిత విజయవంతంగా కొనసాగించారు. ఎంజీఆర్‌ ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లి ప్రజల చేత ‘అమ్మ’గా గౌరవాన్ని అందుకున్నారు. పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే.. ఎంజీఆర్‌ విలువల్ని ముందుకు తీసుకెళ్లాలి. ఎన్నో సవాళ్ల ఎదురైనా ఆ పార్టీ తమిళనాడు ప్రజల గొంతుకగా ఉన్నది. ఇదంతా ఆపార్టీ విలువల వల్లే సాధ్యమైందని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.