ఎన్‌కౌంటర్‌ మృతదేహాలను రేపటి వరకు భద్రపరచండి

https://www.teluguglobal.com/h-upload/2024/12/02/1382725-telangana-high-court.webp

2024-12-02 11:47:23.0

మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు చూపించండి : హైకోర్టు ఆదేశం

ములుగు జిల్లా ఏటూరునాగారం ఎన్‌కౌంటర్‌ లో మృతిచెందిన మావోయిస్టుల డెడ్‌బాడీలు మంగళవారం వరకు భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. ఏటూరునాగారం ఎన్‌కౌంటర్‌ బూటకమని, ఆహారంలో విషం కలిపి వారిని చిత్రహింసలకు గురి చేసి కాల్చి చంపారని పౌరహక్కుల సంఘం దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ ను హైకోర్టు సోమవారం విచారించింది. నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని, విషాహారం ఇచ్చి ముందే మావోయిస్టులను అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురి చేశారని పౌర హక్కుల సంఘం న్యాయవాది హైకోర్టులో వానదలు వినిపించారు. మృతదేహాలపై చిత్రహింసలు చేసి గాయాలున్నాయని తెలిపారు. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు చూపించకుండానే పోస్టుమార్టంకు తరలించారని తెలిపారు. అడవిలో పోలీసుల భద్రత నేపథ్యంలోనే మృతదేహాలను వెంటనే ములుగు హాస్పిటల్‌ కు తరలించాల్సి వచ్చిందని ప్రభుత్వం తరపు న్యాయవాది నివేదించారు. కాకతీయ మెడికల్‌ కాలేజీ మెడికల్‌ ఎక్స్‌పర్టులతో పోస్ట్‌మార్టం నిర్వహించామని, ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీశామని తెలిపారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు మంగళవారం వరకు మావోయిస్టుల డెడ్‌బాడీలు రేపటి వరకు భద్ర పరచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు చూపించాలని పోలీసులను ఆదేశించారు.

ఏటూరు నాగారం మండలం చెల్బాక, ఐలాపూర్‌ అడవుల్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌ లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. మృతుల్లో నర్సంపేట – ఇల్లందు ఏరియా కమిటీ కార్యదర్శి కుర్సం మంగు అలియాస్‌ భద్రు, ఏటూరునాగారం-మహాదేవ్‌పూర్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఈగోలపు మల్లయ్య అలియాస్‌ మధుతో పాటు ఐదుగురు ఉన్నారు.

Eturunagaram,Encounter,Seven Maoists Killed,Telangana High Court,Police,Human Rights Commission