2025-02-22 08:27:38.0
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఈ ఘటన నిదర్శనం : కేటీఆర్
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనపై ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. సుంకిశాలలో రీటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మరువకముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమన్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమీషన్ల వేటలో పర్యవేక్షణను గాలికొదిలేయడం, నాణ్యతా ప్రమాణాల విషయంలో పూర్తిగా రాజీపడిపోవడం వల్లే ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నాయన్నారు. టన్నెల్ పైకప్పు కూలిన ఈ ఘటనలో లోపల ఎవరైనా చిక్కుకుని ఉంటే వారిని క్షేమంగా బయటకు తీసుకురావాలని, ఇందుకోసం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడకుండా నిబంధనల మేరకు పనులు జరిగేలా చూడాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఒక బ్యారేజీలో కేవలం ఫిల్లర్ కుంగితే నానా హంగామా చేసిన కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఈ వరుస వైఫల్యాలపై ఇప్పుడేంమంటారని ప్రశ్నించారు. సుంకిశాల ప్రమాదంలో కాంట్రాక్టర్ ను కాాపాడేందుకు వాస్తవాలు దాచిపెట్టిన ప్రభుత్వం, కనీసం ఎస్ఎల్‌బీసీ సంఘటనపైన అయిన పారదర్శకంగా దర్యాప్తు జరిపించి ప్రమాదానికి గల కారణాలను బయటపెట్టాలన్నారు.
SLBC,Tunnel Collapse,Revanth Reddy,Congress Govt,BRS,KTR