ఏఎన్నార్‌ అవార్డు వేడుకపై బిగ్‌ బీ, మెగాస్టార్‌ స్పందన ఇదే!

 

2024-10-29 03:24:57.0

https://www.teluguglobal.com/h-upload/2024/10/29/1373451-bigb2.webp

తన చేతుల మీదుగా చిరంజీవికి ఏఎన్నార్‌ అవార్డు ప్రదానం చేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్న అమితాబ్‌

తన చేతుల మీదుగా చిరంజీవికి ఏఎన్నార్‌ అవార్డు ప్రదానం చేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు అమితాబ్‌ అన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం నిర్వహించిన ‘ఎఎన్నార్‌ నేషనల్‌ అవార్డ్‌’ ఫంక్షన్‌కు బిగ్‌ బీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులు, నటుల మధ్య ఘనంగా జరిగిన ఈ వేడుక గురించి అమితాబ్‌ పోస్ట్‌ పెట్టారు. చిరంజీవి, నాగార్జునలతో దిగిన ఫొటోను పంచుకున్నారు. ‘ఏఎన్నార్‌ శతజయంతి సందర్భంగా వారి కుటుంబంలోని, పరిశ్రమలోని వ్యక్తిగా ఆయనకు నివాళులు అర్పించాను. ఇది భావోద్వేగాలతో నిండిన సాయంత్రం. ఇంత గొప్ప వేడుకలో నన్ను భాగం చేసినందుకు నాగార్జునకు ధన్యవాదాలు. అలాగే చిరంజీవికి నా చేతుల మీదుగా అవార్డు ఇవ్వడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను’ అని రాసుకొచ్చారు.

నా గురువు చేతుల మీదుగా అందుకోవడం మరింత సంతోషాన్నిచ్చింది

ఈ అవార్డు వేడుకపై మెగాస్టార్‌ చిరంజీవి కూడా పోస్టు పెట్టారు. ‘అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా వారి పేరు మీద ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ‘ఎఎన్నార్‌ నేషనల్‌ అవార్డ్‌’ అందుకోవడం సంతోషంగా ఉన్నది. అది కూడా నా గురువు అమితాబ్‌ చేతుల మీదుగా అందుకోవడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. అక్కినేని కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ, అక్కినేని ఇంటర్నేషణల్‌ ఫౌండేషన్‌ సభ్యులకు, నా మిత్రుడు, సోదరుడు సుబ్బరామిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా సినీ ప్రయాణంలో భాగమై, నా ప్రతి మైలురాయికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎంతో రుణపడి ఉంటాను’ అని రాసుకొచ్చారు. అవార్డు వేడుకలకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. ఈ అవార్డు అందుకున్న సమయంలో అమితాబ్‌ పాదాలకు చిరంజీవి నమస్కారం పెట్టిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 

ANR National Award,Ceremony,Amitabh Bachchan,Megastar Chiranjeevi,Nagarjuna