ఏక్ నిరంజన్…(కథ)

2023-03-21 07:54:46.0

https://www.teluguglobal.com/h-upload/2023/03/21/727655-aruna-ch.webp

పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసుకుంటున్న అమ్మ గొంతుతో, మెలకువ వచ్చింది దీపికకు . కమ్మటి ఫిల్టర్ కాఫీ వాసన రారమ్మని పిలుస్తోంది. బెంగళూరు నుండి వచ్చాక అమ్మతో ఉండడం మొదలెట్టాక రోజు అమ్మ చేతి ఫిల్టర్ కాఫీనే. టీ బాగా అలవాటు ఉన్న దీపిక అత్తయ్య మామయ్య కూడా అమ్మ చేతి ఫిల్టర్ కాఫీకి బాగా అలవాటు పడిపోయారు.

బ్రష్ చేసుకుంటూ అలవోకగా సుప్రభాతం అమ్మ గొంతు నుండి వింటూ వుంది దీపిక .పక్షుల కిచకిచ సౌండ్తో ఎవరో బెల్ కొట్టిన శబ్దం అయింది. లేవబోతున్న అమ్మని నేను చూస్తానని చెప్పి, వెళ్లి తలుపు తీసి చూడగా ….సంకేత్.!

మౌనంగా పక్కకు జరిగి దారి ఇచ్చింది .ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయిన తనతో సంభాషణ ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక, వెళ్లి వాళ్ళ అత్తగారిని పలకరించాడు.

“ఆంటీ బావున్నారా? మీరు మామూలుగానే రోజూ తొందరగా లేస్తారు కార్తీకమాసం అని అప్పుడే లేచారు?” కలుపుగోలుగా మాట్లాడాను అనుకున్నాడు కానీ అడగాలి అన్నట్టుగా అడిగినట్టుగా అతనికే అర్థమైంది.

అదేమీ పట్టించుకోనట్లు అవునంటూ తల ఊపి బ్రష్ చేసుకుని రా కాఫీ ఇస్తానని సైగ చేసింది చంద్రమ్మ.

అతని ఇబ్బందిని గ్రహించినట్లు మౌనంగా ఒక బెడ్ రూమ్ లోకి దారి తీసింది దీపిక. ఆమె వెనకే ఆ రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి, ఇంకా అక్కడే ఉన్న దీపిక పక్కనే కూర్చున్నాడు. ఇద్దరి మధ్య ఏదో పల్చటి అడ్డుతెర ఉన్నట్లుగా ఏమీ మాట్లాడుకోలేకపోయారు. ఇక ఈ ఐస్ బద్దలు కొట్టాల్సిందే అనుకున్నాడేమో, ఒక్కసారిగా దీపిక ఒళ్ళో తలవాల్చేసి,

బొంగురు పోయిన గొంతుతో “ఏంట్రా ఇది? ఏదో అన్నానే అనుకో, ఆఫీస్ స్ట్రెస్, రెసిషన్లో ఉంటామా ..

ఊడుతుందా అన్నది తెలియదు.. అంతమాత్రానికే…” దుఃఖంతో పూడుకు పోయింది అతని గొంతు.

ఆమెకీ ఉవ్వెత్తున దుఃఖం ఎగిసి పడింది. కంట్రోల్ చేసుకుంటూ అతని జుట్టులోకి వెళ్లిపోనిచ్చి నిమురుతూ, “ఒకసారి అయితే ఆ స్ట్రెస్ అనుకోవచ్చు నువ్వు పదేపదే అదే మాట మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోయాను”

“నువ్వు లేకుండా నేను మాత్రం బావురుమంటూ ఆ ఇంట్లో ఒక్కడిని ఏక్ నిరంజన్ లా అసలు ఎలా ఉండగలను అనుకున్నావు నువ్వు ఎలా ఉందాం అనుకున్నా వ్?”

కొడుకు వచ్చిన అలికిడి విని భార్గవమ్మ, సూరయ్య గారు బయటకు వచ్చారు.

” అరే కన్నా” అమ్మానాన్నల గొంతులా ఉంది అంటూ సంకేత్ బయటికి వచ్చాడు. వాళ్లు కూడా అక్కడే ఉండడం చూసి ఒక్క క్షణం షాక్ అయ్యాడు. వెనక్కు తిరిగి దీపికని చూశాడు. నాకు ఇద్దరు ఒకటే అన్నట్లుగా దీపిక కళ్ళు చెప్పాయి. ఒకసారిగా గతంలోకి వెళ్లిపోయాడు సంకేత్

సంకేత్ దీపిక చూడ చక్కని జంట. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనట్లుగా అల్లుకుపోయింది బంధం. ఇద్దరికీ బెంగళూరులోనే ఉద్యోగాలు రావడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. అయితే రెండు నెలలకు ఒకసారి, అటు అత్తా మమ్మల్ని ,ఇటు అమ్మానాన్నలని రమ్మని పిలుస్తూ ఉండేది దీపిక. అలా వచ్చినప్పుడు వాళ్ళు ఒక పది రోజులు ఉండేలా తమ జ్ఞాపకాలు అన్ని మళ్ళీ వచ్చేదాకా వారికి ఫ్రెష్ గా ఉండేలా చూసుకునేది.

అయితే ఒక రోజు, అలాగే అమ్మకి పోయిన నెలలో అత్తయ్య వాళ్ళు వచ్చి వెళ్లారు కదా ఈ నెలలో మీరు రండి అని చెప్తుంటే విన్నాడు సంకేత్.

“ఏంటి ఎప్పుడు మనకి మనం ఎప్పుడూ ఉండమా?.. ఎప్పుడూ వాళ్ళను వీళ్ళను రమ్మంటూ ఉంటావు. అసలు మా అమ్మ నాన్నల్ని కూడా అంత వెంట వెంటనే పిలవద్దని ఎన్నోసార్లు చెబుదామనుకున్నాను మనకంటూ ప్రైవసీ లేకుండా పోతుంది.”

“అయ్యో పాపం !అవునా బుజ్జిబాబు చేసే అల్లరికి అడ్డుకట్టవాళ్లు..” అల్లరిగా అతన్ని ఆట పట్టించింది.

“నువ్వు ఏమైనా అనుకో మనమే ఇక్కడ ఇంకా పూర్తిగా సెటిల్ కాలేదు. ఎందుకు అస్తమానం పిలుస్తూ ఉంటావు. మీ అమ్మానాన్న వచ్చినప్పుడు ఆవిడ నచ్చినవన్నీ వండి పెడుతుంది బానే ఉంది. కానీ మన ఇద్దరి మధ్య ఏ చిన్న పేచీ వచ్చినా కల్పించుకుని ఏదో ఒకటి చెప్తుంది. నాకు అది అస్సలు నచ్చడం లేదు.”

“అందుకే బాబు తమరి తాపం లాగానే కోపం కూడా అందరి ముందు ప్రదర్శించవద్దు అనేది”

“నాలుగు గోడల మధ్య జరగాల్సిన పేచీ అయినా ప్రేమైనా, నలుగురి మధ్య జరిగితే జరిగేది అదే మరి”

అతని మాటను పెద్ద సీరియస్ గా తీసుకోకుండా చెప్పింది దీపిక

కానీ ఆరోజు అతను ఏ మూడ్ లో ఉన్నాడో ఏంటో.. “ఇప్పుడే చెప్తున్నాను మా అమ్మ నాన్నలకి నేనే రావద్దని చెప్పేస్తాను .నువ్వు కూడా మీ వాళ్లకు చెప్పుకో .నాకు అసలు నచ్చడం లేదు. మా వాళ్లనే నేను వద్దని చెప్తున్నప్పుడు మీ వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావ్, పోనీ అమ్మనో అత్తయ్య నో పిలిస్తే నీకు సాయంగా ఉంటారు అనుకోవచ్చు ప్రతిసారి ఇద్దరిని ఇద్దరినీ రమ్మంటావు”

అతను చాలా సీరియస్ గానే ఆ మాట అంటున్నాడని అర్ధమైన దీపిక, “చూడు సంకేత్, మనం కాలేజీలో ఒకరినొకరు నచ్చి ఇష్టపడే పెళ్లి చేసుకుని ఉండొచ్చు పెద్దల అనుమతితో. నాకు నీ వ్యక్తిత్వం పద్ధతి బాగా నచ్చి నిన్ను ఎన్నిక చేసుకొని ఉండొచ్చు అవన్నీ నిజమే. కానీ నా 16 ఏటనే టీవీలో బడిపంతులు సినిమా చూసినప్పుడు ఎన్టీఆర్ ని అంజలీదేవిని చెరొక కొడుకు పంచుకోవడం చూసి, అప్పుడే నిర్ణయించుకున్నాను. ఆ వయసులో వారిని అలా విడదీయకూడదని, ఒక్కడే అబ్బాయి ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలని, అందుకే” ఇంకా ఏదో చెప్పబోతున్న దీపికని అడ్డుకున్నాడు సంకేత్.

“అదంతా నాకు తెలియదు నాకు చెప్పకు. అంటే నేను ఒక్కడినే ఉండడం వల్ల నువ్వు ఓకే చేసావా..”

“అదొక కారణం అని చెప్తున్నాను అది ఒక్కటే కారణం కాదు, అయినా నా నిర్ణయం వల్ల అత్తమామలు విడిగా ఉండకూడదు అనే కదా నా ఉద్దేశం” చిన్నగా మొదలైన పేచీ దారి తప్పుతుందని గ్రహించి కన్విన్స్ చేయబోయింది.

ఆ క్షణంలో తను అన్న మాటకి వెంటనే సరే అనకుండా అలా చెప్పిన దీపిక ని చూసి, అతని మేల్ ఇగో హర్ట్ అయిందో,, లేక దీపిక చెప్పిన కారణానికి బాధపడ్డాడో కానీ కోపంగా ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. ఆ కోపం అలా ఒక 15 రోజులు పాటు కొనసాగింది.

హాయిగా ఉన్న కుటుంబంలో ఎందుకు ఇలాంటి కలతలు” తనే కల్పించుకుని మాట్లాడింది దీపిక ఒక రోజు. ఏదో స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడని కూడా ఆమెకు అర్థమైంది.

“మనం హాయిగా ఉండాలి అంటే అటువైపు కాని ఇటువైపు కాని ఎవరూ రాకూడదు “మళ్లీ ఖండితంగా చెప్పాడు.

ఈసారి దీపిక ఏమి వాదించలేదు అతనిని ఒకసారి నిశితంగా పరిశీలించింది. అంతే ఆ మరు రోజున, దీపిక కనిపించలేదు ఇంట్లో. పిచ్చెక్కిపోయిన సంకేత్ అంతా పిచ్చివాడిలా వెతికాడు, బెడ్రూంలో కళ్ళముందు ఉన్న ఉత్తరం కనబడేదాకా.

“సంకేత్ వాదనలోనే చెప్పినా నేను

అన్నది నిజం. వయసు మీద పడ్డ వారికి మన సాయం అవసరం. వారు చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కడో కాని రాష్ట్రంలో ..వాళ్ళలా బాధపడుతూ ఉంటే మనం ఇక్కడ ఆనంద పడగలమా. పెళ్లయిన తొలినాళ్లలో ఏం ఆనందపడి ఉంటారో, ఆ తర్వాత పిల్లలు ,వాళ్ళు ఎదుగుదల ,వాళ్ళ పెళ్లిళ్లు ,మళ్లీ తిరిగి ఈ వయసులోనే ఒకరికొకరుగా జీవనం మొదలవుతుంది. అందుకే ఎప్పుడు పిలిచినా ఇద్దరినీ పిలుస్తున్నాను.

భగవంతుడు వారిని విడదీసేదాకా మనం విడదీయడం ఎందుకు. మా అన్న దగ్గరకు మీ చెల్లి దగ్గరకు వెళ్ళొచ్చు కదా అనేది నీ వాదన. నీ మాటల్లో ఎవరో ఒకరిని పిలవచ్చు కదా పోనీ అమ్మని ,అది మీ అయినా మా అయినా వస్తే ఉరుకుల పరుగులుగా ఇద్దరం ఉద్యోగానికి వెళ్ళినప్పుడు సహాయంగా ఉంటారు అనే కదా!.. కానీ అలా వాళ్ళిద్దర్నీ చెరోచోటన ఉంచడం మన అవసరానికి పిలవడం నాకు ఇష్టం లేని విషయం. అందుకే ఎప్పుడు పిలిచినా ఇద్దరినీ రమ్మని చెప్తాను.

నీకు అసలు రావడమే ఇష్టం లేదంటే ఇక నేను ఏమి చేయలేను. ఒంటరిగా బ్రతకడం నీకు బాగా అలవాటయిందేమో నేను చిన్నప్పటి నుంచి కూడా నలుగురిలోనే పెరిగాను. బంధు ప్రీతి ఎక్కువ. నేను ఇద్దరమ్మా నాన్నల్ని సమానంగానే చూశాను. గారాబంగా పెంచుకున్న పిల్లని తమ ముందే ఒక మాట అంటే, స్పందించడం సహజం. కోపంలో కూడా మాటతూలకుండా ఉండడమే కదా పరిణతి. ఎందుకయ్యా అలా అంటావు అన్నమాట తప్ప మా అమ్మ ఎప్పుడు నిన్ను అవమానంగా మాట్లాడలేదు నాన్న అయితే అసలు కల్పించుకోరు. నువ్వు లేనప్పుడు అబ్బాయికి కోపం తెప్పించకు అని నన్నే కోప్పడేది.అయినా నువ్వు నా వారిని వద్దంటున్నా ,నీ వారిని కూడా పిలవకు అనడం నాకు చాలా బాధ కలిగించింది. నేను అలా నా వారు నీ వారు అని చూడలేదు. ఏక్ నిరంజన్ గా నువ్వే బతుకు నేను వాళ్లతోనే ఉంటాను

-ఆనాటి నువ్వు కాని నీకు

కానిదానినైన నేను

దీపిక

ఉత్తరం చదివినప్పుడు రెండు రోజులు బింకంగా ఉన్నా పోనీ నాకేంటి అనీ తను లేని లోటు బాగా తెలి సి వస్తుంది ఎక్కడికి వెళ్తుందో కూడా చెప్పలేదే అని రెండు రోజులు బాధపడ్డాడు.

అతని చెల్లెలితో దీపిక చాలా స్నేహంగా ఉండడం గుర్తుకొచ్చి చెల్లెలి ద్వారా ఆమె ఎక్కడుందో కనిపెట్టి పరుగున వచ్చేసాడు. అయితే అతను ఊహించనిది, దీపిక వాళ్ళ అమ్మానాన్నలతో ఉంటుందేమో అనుకున్న వాడికి అతని అమ్మానాన్నలను కూడా తెచ్చి అక్కడే పెట్టుకుంటుందని . దీపిక లో ఏ కల్మషం లేదు. నా బంగారు కొండ అనీ మనసులోనే అనుకున్నాడు.

“ఏరా? ఎలా ఉన్నావ్? ఎప్పుడు బయలుదేరావ్ ఏమైనా తిన్నావా? అడుగుతుంటే ఏం చెప్పవే? “అన్న అమ్మ మాటలకి ఈ లోకంలోకి వచ్చాడు.

“అమ్మానాన్న అత్తయ్య మామయ్య నన్ను మన్నించండి. నేనూ కొంచెం మంచివాడినే! అంత దుర్మార్గుడిని కాను. రెసిషన్లో అదే కొన్ని ఉద్యోగాలు ఆర్థిక పరిస్థితుల వలన తీసేయడం అప్పుడప్పుడు జరుగుతుంది కదా. ఎక్కడ నా ఉద్యోగం తీస్తారో అన్న ఆందోళనలో ఏదేదో మాట్లాడేసాను. దీపిక ఇంత గట్టి నిర్ణయం తీసుకుంటుందని అసలు ఊహించలేదు” పశ్చాత్తాప పడుతూ అందరినీ చూస్తూ చెప్పాడు

మిమ్మల్ని ఒంటరి వాళ్ళను చేయను అని, అక్కడ నన్ను

ఏక్ నిరంజన్ గా వదిలేసి ఇక్కడ తను ఒంటరిదై సాధించిందేముంది. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. మరి ఈ మూడు బెడ్రూంల అపార్ట్మెంట్ కి లోన్ దీపిక ఒకటే భరించలేదు కదా నేను కూడా ఇక్కడికే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. అందుకే దీపిక వెళ్లగానే నాకు , ఈ పనులకే పది రోజులు పట్టింది” నెమ్మదిగా అసలు విషయం చెబుతూ దీపికనే సూటిగా చూస్తూ కళ్ళతోనే క్షమించమన్నట్టుగా అడిగాడు.

దీపిక మౌనంగా లోపలికి వెళ్లిపోయింది.

“ఏయ్ జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు, నువ్వు ఏక్ నిరంజన్ నన్ను ఏక్ నిరంజన్ చేస్తే వాళ్ళకి తోచుబడికి మన వలని ఇవ్వడం చాలా ఆలస్యం

అయిపోతుందమ్మాయ్”మళ్లీ తన అల్లరి ధోరణిలోకి వచ్చి దీపిక వెనకే వెళ్లి చెప్పాడు.

అతనిలో వచ్చిన మార్పుకి, అన్న అల్లరి మాటలకి ఫక్కున నవ్వేసింది దీపిక.

“హమ్మయ్య దేవి గారికి అలకతీరిందా, ఇక మిస్ అయిన సిలబస్ అంతా చదివేద్దాం”

“ఏయ్”

వాళ్ళిద్దరు నవ్వులు విన్న ఆ నలుగురి పెద్దల మనసులు తృప్తితో నిట్టూర్చాయి.

– అరుణ సి.హెచ్

Ek Niranjan,Aruna CH,Telugu Kathalu