ఏటీఎంలో భారీ చోరీ.. రూ.30 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు

2024-08-04 15:34:07.0

గ్యాస్‌ కట్టర్లతో ఏటీఎం సెంటర్‌లోకి ప్రవేశించిన దొంగలు ఏటీఎంను పగలగొట్టి అందులో ఉన్న సుమారు రూ.30 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.

https://www.teluguglobal.com/h-upload/2024/08/04/1349650-thieves-decamp-with-rs-30-lakh-from-an-atm-at-anantapur.webp

కష్టపడకుండా డబ్బు సంపాదించేందుకు అడ్డదారిని ఎంచుకుంటున్న నిందితులు ఎంతకైనా తెగిస్తున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాల నిఘా ఉంటున్నప్పటికీ చోరీలకు తెగబడుతున్నారు. తాజాగా అనంతపురంలోని రామ్‌నగర్‌ సమీపంలో జరిగిన ఘటనే దీనికి తాజా ఉదాహరణ. రామ్‌నగర్‌ సమీపంలోని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎంలో చోరీకి తెగబడి సుమారు రూ.30 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఆదివారం ఉదయం సమాచారం అందడంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

అనంతపురంలోని రామ్‌నగర్‌ సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. గ్యాస్‌ కట్టర్లతో ఏటీఎం సెంటర్‌లోకి ప్రవేశించిన దొంగలు ఏటీఎంను పగలగొట్టి అందులో ఉన్న సుమారు రూ.30 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం ఏటీఎంలో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. నాలుగో పట్టణ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌ ఘటనాస్థలిలో ఆధారాలను సేకరించాయి. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ ప్రతాపరెడ్డి తెలిపారు.