ఏపీలో జీబీఎస్‌తో మరో మహిళ మృతి

2025-02-19 16:17:49.0

ఏపీలో జీబీఎస్ కలకలం రేపుతోంది.

https://www.teluguglobal.com/h-upload/2025/02/19/1405030-kkfjkk.webp

ఏపీలో జీబీఎస్ బారిన పడి మరో మహిళ మృతి చెందింది. గులియన్‌ బారీ సిండ్రోమ్‌ లక్షణాలతో షేక్ గౌహర్ ఖాన్ అనే మహిళ ఈనెల గుంటూరు జీజీహెచ్‌లో చేరారు. వ్యాధి తీవ్రత పెరిగి ఇవాళ సాయంత్రం మరణించింది. ఇటీవల ఇదే ఆసుపత్రిలో కమలమ్మ అనే మహిళ జీబీఎస్‌తో చనిపోగా.. ఇపుడు మరో మహిళ కూడా మరణించడంతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జీబీఎస్ బాధితులు భయంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ వ్యాధి బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగుతుండడంతో కలకలం రేగుతోంది.

జీబీఎస్‌తో మరి కొందరు బాధితులు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.మెదడు నుంచి కాళ్ల వరకు పొడవుగా ఉండే కాలి నరాలు ప్రభావితమై కాళ్లు చచ్చుబడిపోతాయి. క్రమంగా వీపు భాగం, చేతులు, మెడ కండరాలు ఇలా దేహమంతా పూర్తిగా అచేతనమవుతుంది. గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు. మింగడమూ కష్టమవుతుంది. ముఖంలోని కండరాలు అచేతనమైతే కళ్లు కూడా మూయలేడు.ఈ ప్రక్రియ ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పని చేయించే డయాఫ్రమ్‌ కండరాల వరకు వెళ్లినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆ స్థితికి వచ్చిన బాధితులు మృతి చెందే అవకాశం ఉంది. ఈ వ్యాధి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. తీవ్రత స్వల్పంగా ఉంటే నడక కష్టమవుతుంది. ఎక్కువగా ఉంటే బాధితులు పూర్తిగా మంచానికే పరిమితమవుతారు.