ఏపీలో ‘వాట్సప్‌ గవర్నెన్స్‌’ ప్రారంభం

2025-01-30 07:31:10.0

ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్‌…తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలు

https://www.teluguglobal.com/h-upload/2025/01/30/1398780-ap-cm-watsup.webp

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పౌరసేవలు అందించడానికి, ప్రజల నుంచి వినతులు స్వీకరించడానికి, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేయడానికి వీలుగా వాట్సప్‌ గవర్నెన్స్‌ (వాట్సప్‌ పరిపాలన )కు శ్రీకారం చుట్టింది. ఇందులో తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలు అందిస్తున్నారు. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలి విడతలో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్‌ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్‌ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలయ్యాయి. దీనికోసం అధికారిక వాట్సప్‌ నంబర్‌ 95523 00009 ను కేటాయించారు.

ప్రభుత్వం ఏదైనా సమాచారం పౌరులకు పంపించాలంటే ఈ వాట్సప్‌ ఖాతా ద్వారా మెసేజ్‌లు పంపిస్తుంది. ఒకేసారి కోట్ల మందికి ఈ సమాచారం చేరుతుంది. వరదలు, వర్షాలు, విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల మరమ్మతులు, వైద్యారోగ్య, వ్యవసాయ, అత్యవసర, పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధి సమాచారం వంటివి అందిస్తారు.

ప్రజలు వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనకుంటే ఈ వాట్సప్‌ నంబర్‌కు మెసేజ్‌ చస్తే వెంటనే లింక్‌ వస్తుంది. అందులో పేరు, ఫో్‌ నంబర్‌, చిరునామా తదితరాలు పొందుపరిచి, వారి వినతిని టైప్‌ చేయాలి. వెంటనే వారికి ఒక రిఫరెన్స్‌ నంబర్‌ వస్తుంది. దానికి ఆధారంగా తమ వినతి పరిష్కారం ఎంత వరకు వచ్చింది? ఎవరి వద్ద ఉన్నది అనేది పౌరులు తెలుసుకోవచ్చు.

ఈ ధృవపత్రాలు పొందవచ్చు

ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌, ఆదాయ, నో ఎర్నింగ్‌.. ఇలా వివిధ శాఖలకు సంబంధించిన అనేక సర్టిఫికెట్లు వాట్సప్‌ ద్వారా పొందవచ్చు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కు చేసిన దరఖాస్తుల స్టేటస్‌ తెలుసుకోవచ్చు. విద్యుత్‌ బిల్లులు, ఆస్తి పన్నల వంటి ఈ అధికారిక వాట్సప్‌ ద్వారా చెల్లించవచ్చు. ట్రేడ్‌ లైసెన్సులు, రెవెన్యూ శాఖకు సంబంధించిన ల్యాండ్‌ రికార్డుల, వివిధ సర్టిఫికెట్ పొందవచ్చు.