ఏపీ క్యాబినెట్‌ నిర్ణయాలివే

2024-11-06 08:27:24.0

ల్యాండ్‌ గ్రాబింగ్‌ ప్రొహిబిషన్‌ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం

https://www.teluguglobal.com/h-upload/2024/11/06/1375255-chabdrababu.webp

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్‌ సమావేశం జరిగింది. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ రాజధాని ప్రాంత పరిధిని పునరుద్ధరిస్తూ ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. వైసీపీ హయాంలో సీఆర్‌డీఏ పరిధిని కుదించి అమరావతి ప్రాంతానికి పరిమితం చేసింది. దీంతో రాజధాని ప్రాంత విస్తరణ గణనీయంగా తగ్గిపోయింది. గతంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 8352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సీఆర్‌డీఏను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్రంలో భూ ఆక్రమణల ఫిర్యాదులు పెద్ద ఎత్తున రావడంతో సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ల్యాండ్‌ గ్రాబింగ్‌ ప్రొహిబిషన్‌ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.త్వరలో జరిగే శాసనసభ సమావేశాల్లో పాత చట్టం రద్దు, కొత్త చట్టం రూపకల్పన చేయనున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటునకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణ, 2014-18 మధ్య నీరు, చెట్టు పెండింగ్‌ బిల్లుల చెల్లింపులకు ఆమోదం చెప్పింది. ఎక్సైజ్‌ చట్ట సవరణ ముసాయిదాకు, కుప్పం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ లక్ష్యాల సాధనకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.