2024-10-21 06:23:47.0
ఏ ప్రగతి జరగాలన్నా పోలీసులే కీలకమన్న ఏపీ సీఎం
https://www.teluguglobal.com/h-upload/2024/10/21/1370936-cm-chandra-babu.webp
విధి నిర్వహణలో చాలామంది పోలీసులు ప్రాణాలు కోల్పోయి ప్రజల హృదయాల్లో త్యాగధనులుగా నిలిచారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అన్నింటికంటే పోలీస్ శాఖ అత్యంత కీలకమన్నారు. విజయవాడలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఏ ప్రగతి జరగాలన్నా పోలీసులే కీలకమన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడటానికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేశారు. ఫ్యాక్షనిజం, రౌడీల ఆట కట్టించారు. శాంతిభద్రతలను కాపాడటంలో ఏమాత్రం రాజీ పడలేదన్నారు. పోలీసుల సంక్షేమం మా ప్రభుత్వ బాధ్యత అన్నారు. పటిష్ట యంత్రాంగంగా తయారు చేయడం మా కర్తవ్యమని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చామని చెప్పిన సీఎం… వాహనాలతో పాటు పరికాలు, సాంకేతిక సౌకర్యాలు కల్పించామన్నారు. ఏపీ పోలీసులు అంటే దేశంలోనే మోడల్‌గా తీర్చిదిద్దాలని ముందుకెళ్లామన్నారు.
సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి దీటైన పోలీస్ వ్యవస్థకు శ్రీకారం చుట్టామన్నారు. విశాఖపట్నంలో గ్రేహౌండ్స్ కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. కేంద్రం ఎప్పటికప్పుడు పోలీసు వ్యవస్థ ప్రక్షాళనకు ముందుకొస్తున్నది. ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన 125 రోజుల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ చెల్లించాం. దిశ పేరుతో వాహనాలకు రూ. 16 కోట్లు, కమ్యూనికేషన్ పరికరాల కోసం రూ. 20 కోట్లు పెండింగ్ పెడితే వాటినీ చెల్లించామని చంద్రబాబు వివరించారు.