ఏరు దాటాక తెప్ప తగలేసే రకం చంద్రబాబు

2024-08-09 04:09:26.0

వైద్య విద్య సక్రమంగా పేద విద్యార్థులకు అందాలని, లేకపోతే వైసీపీ ఉద్యమాలు చేయటానికి రెడీగా ఉంటుందని హెచ్చరించారు. రోడ్లను ప్రైవేటీకరణ చేస్తానని చంద్రబాబు అంటున్నారని, టోల్‌ గేట్లు పెట్టి డబ్బు వసూలు చేయాలనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

https://www.teluguglobal.com/h-upload/2024/08/09/1350956-former-minister-meruga-nagarjuna-appeals-to-chandrababu-not-to-privatize-government-medical-colleges.webp

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని, ఆయన తన వైఖరిని మరోసారి తేటతెల్లం చేస్తున్నారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. ఏనాడూ ఒక్క మెడికల్‌ కాలేజీని కూడా తీసుకురాని చంద్రబాబు.. ఏపీలో ఉన్న మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం సరికాదన్నారు. తాడేపల్లిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ఎన్నికలకు ముందు మెడికల్‌ కాలేజీలపై చంద్రబాబు, పవన్, లోకేష్‌ విషం కక్కారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. వైద్య విద్యను అమ్మేశారంటూ ఎల్లో మీడియాలో అడ్డగోలుగా రాతలు రాయించార‌ని గుర్తుచేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చంద్రబాబు వైఖరి ఏరు దాటాక తెప్ప తగలేసే రకంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. వైద్య విద్యను ఇప్పుడు ప్రైవేటుపరం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్న విషయాన్ని లోకేష్, పవన్‌ కేబినెట్‌లో ఎందుకు ప్రస్తావించలేదని మేరుగ నాగార్జున ప్రశ్నించారు. ఏపీలో 12 మాత్రమే మెడికల్‌ కాలేజీలు ఉంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక మరో 17 కాలేజీలను తెచ్చారని ఆయన తెలిపారు. పేదల గురించి జగన్‌ ఆలోచిస్తారు కాబట్టే కొత్తగా మెడికల్‌ కాలేజీలు తెచ్చారని అన్నారు. ఏపీలో అదనంగా 750 సీట్లను వైఎస్‌ జగన్‌ పెంచగలిగారని చెప్పారు. జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీని తెచ్చార‌ని గుర్తుచేశారు.

ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 17 కాలేజీలనూ పూర్తి చేసి వైద్య విద్య‌ను పేద విద్యార్థుల‌కు అందుబాటులోకి తేవాలని మేరుగ నాగార్జున అన్నారు. కానీ ఈ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలనుకోవడం కరెక్టు కాదని చెప్పారు. వైద్య విద్య సక్రమంగా పేద విద్యార్థులకు అందాలని, లేకపోతే వైసీపీ ఉద్యమాలు చేయటానికి రెడీగా ఉంటుందని హెచ్చరించారు. రోడ్లను ప్రైవేటీకరణ చేస్తానని చంద్రబాబు అంటున్నారని, టోల్‌ గేట్లు పెట్టి డబ్బు వసూలు చేయాలనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి ప్రైవేటీకరణ గురించి ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు తీరుతో ప్రజల నుంచి ప్రభుత్వంపై కచ్చితంగా వ్యతిరేకత వస్తుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.