ఐక్యం చేసుకో (కవిత)

2023-02-14 12:38:49.0

https://www.teluguglobal.com/h-upload/2023/02/14/723177-aikyam-chesuko.webp

మంచు నిండిన

ఈ ఉదయసంధ్యారాగాన

ఎక్కడివీ

మధు పరిమళాలు ?

బహుశా మత్తెక్కించే

స్వప్నాలలో విహరించిన-

నీ జ్ఞాపకాల

పారిజాత సుమాలు

వెదజల్లాయి కాబోలు!

పురివిప్పిన నెమలి ఆనందనాట్యానికి తోడుగా-

కుహుకమై దివ్య గానాలతో అలరించినావు నీవు…

ఆ కలలో!!

మన ప్రేమ బంధం

ద్వేషం నుండే పుట్టింది కదా!

అయినా – నీ సంకల్పానికి,

నీ భావనలకి కట్టుబడి

ఆ మహత్తర శక్తి గల ప్రేమతో

ఈ బంధాన్ని

పటిష్ట పరచుకున్నానే!

ప్రేమ తత్వంలో

ఉన్న ఐక్యత భావనలతో

ప్రకృతి లయలతో

మమేకమయ్యానే !

ఒక్కసారి నిన్ను

స్పృశించనియ్యి చెలీ!

నీ ప్రేమ కోసం పరితపిస్తున్న

నా హృదయ వేదనను

ఆ తపనను

అర్థం చేసుకొని –

నీ ప్రేమను పంచవా చెలీ….

దేవుడు మన హృదయాల్లో ఉన్నాడంటారు!!

పాపం ఆ దేవుడికి

నా హృదయంలో చోటే లేదు..

ఎందుకంటే-

నా హృదయం నిండా

నీవే కదా!

అందుకేనేమో –

ఆ దేవుడు నాలో

ఎన్నో లోపాలు ఉంచాడు!!

అందులో

ముఖ్యమైన లోపం-

నా సర్వస్వం

నీవే అనుకోవడం!!

ఈ లోపం సర్దుబాటు

చేసేందుకు

నీ హృదయంలో

నన్ను ఐక్యం చేసుకో!!

– రూపాకృష్ణ

Aikyam Chesuko,Rupa Krishna,Telugu Kavithalu