2023-09-05 19:13:56.0
https://www.teluguglobal.com/h-upload/2023/09/05/820642-i-paydo.webp
ఇండియాలో ఎప్పుడు ఎవరికి ఫోను చేసినా “మీకేమమ్మా, అమెరికాలో ఉన్నారు. కోట్లు సంపాదిస్తారు” అనే వాళ్లే గానీ ఆ కోట్ల వెనక ఖర్చూ కోట్లలో ఉంటుందని ఎవరికీ తెలీదు.
మొన్నామధ్య మా పెత్తల్లి గారి బావగారి అల్లుడి తమ్ముడొకాయన ఇండియా నించి మిస్డ్ కాల్ ఇచ్చాడు. మేం ఇండియా నంబరు చూడగానే తిరిగి చేసేం. ఇది రివాజు కూడా. అక్కడి నుంచి చేస్తే కాల్‌కి ఎక్కువ ఛార్జీలు పడతాయి కాబట్టి మా అమ్మగారికీ, అత్తగారికీ మిస్డ్ కాల్ ఇస్తే తిరిగి మేమే చేస్తామని చెప్పేం. ఈ విషయం చుట్టాలందరికీ ఇంత త్వరగాతెలిసిపోతుందనుకోలేదు.
ఇంతకీ కాల్ చేసిన మా చుట్టపు పెద్ద మనిషి మాటల్లో మా వారిని “ఏవండీ మీ జీతమెంత?” అనడిగేడు.గబుక్కున సమాధానం చెప్పలేక దగ్గుతూ ఈయన “ఆరు వేలండీ” అన్నారు.”ఆ దగ్గులోనే అర్థమైపోతూంది, సరిగ్గా చెబ్దురూ “అన్నాడు.ఈయనకు ఒళ్లుమండి ఇండియా రూపాయల్లో తర్జుమా చేసి “మూణ్ణాలుగు లక్షలండీ” అన్నారు.”అలా అన్నారు బావుంది, నెలకి ఖర్చు ఒక యాభై వేలు పోతాయనుకున్నా, మిగతా లక్షలన్నీ ఏం చేస్తారండీ బావగారూ” అన్నాడు మళ్లీ.ఇక్కడి సంపాదనని అమెరికన్ డాలర్లలోనూ, ఇక్కడి ఖర్చుని ఇండియాలో ఖర్చుతోనూ సరిపోల్చుకున్నాడనుకుంటా.
ఆయకీయన బావెలా అవుతాడో అని ఆలోచిస్తున్నట్టున్నారు ఈయన, వెంటనే సమాధానం చెప్పలేక తడుముకుంటూంటే ఫోను నాకివ్వమని పుచ్చుకున్నాను.”నాకంటే అవన్నీ ఈవిడకే బాగా తెలుసండీ” అని ఫోను నా చేతిలో పెట్టేరీయన.”అయినా మీకు తెలీందేముంది అన్నయ్య గారూ, ఎంత చెట్టుకంత గాలి మిగిలేదేముండదు” అన్నాను. అదెలాగూ కంఠతా డైలాగూ, పైగా నిజమూ కాబట్టి.”ఆ..నువ్వెన్నైనా చెప్పు చెల్లెమ్మా, అమెరికా అమెరికానే, ఇండియా ఇండియానే..”నాకేమీ అర్థం కాకపోయినా “అవునండీ అన్నయ్యగారూ” అన్నాను మర్యాదకి.”చూసేవా, ఒప్పేసుకున్నావు” అని, “ఒక్క నిమిషం -మా పెద్దాడు మాట్లాడతాడట”, అంటూ పక్కనెవరికో ఫోనిచ్చాడు.”చెప్పరా, చెప్పు” అని గదమాయింపు వినబడుతోంది పక్కనించి.
మళ్లీ ఫోనందుకుని, “ఏం లేదమ్మా వాడికి బయటవాళ్లతో మాట్లాడమంటే నోరు పెగలదు. మీరు మరో మూణ్ణెల్లలో ఇండియా రాబోతున్నారని తెలిసింది, మా వాడు”ఐపేడో, ఐపాడో” ఏదో ఒకటి కావాలని ఒకటే పేచీ. అత్తయ్యతో చెప్పి తెప్పిస్తానని హామీ ఇచ్చేనులే, ఏవంటావ్” అన్నాడు.స్పీకర్ ఫోనులో అంతా వింటున్న ఈయన కళ్లు తేలేసేరు.
మర్నాడు ఈయన పిన తాత గారి మరదలి మనవడి బావగారొకాయన ఫోను చేసేడు. మరో వారంలో మరొకరు, మరో వారంలో మరొకరు. సంభాషణ ఎలా మొదలైనా చివరి వాక్యాలు ఎప్పుడూ అవే. “ఐపేడో, ఐపాడో”. తీరిగ్గా లెక్కేసాం ఒక రోజు. మా తరఫు వాళ్లు ఏడుగురు, వాళ్ల తరఫు వాళ్లు ఎనమండుగురు అడిగారిప్పటికి.
ఈయనీ విషయంలో ఏమైనా అంటే మా వాళ్ళకంటే వాళ్ల వాళ్ల సంఖ్య ఎక్కువగాఉందని దెప్పిపొడవడానికి
సిద్ధంగా ఉండి, మరోసారి లెక్కేసాను. కరెక్టే.”మొత్తం ఎందరు?” అడిగేరీయన మొత్తానికి.ఎవరివైపు ఎందరు అని అడగనందుకు కించిత్ నిరుత్సాహంగా చెప్పేను.
”ఏవోయ్, వీళ్లందరికీ ఐపేడ్లు, ఐపాడ్లు కొని తీసుకెళ్లడానికి మనకేమైనా ఇక్కడ ఆపిల్ చెట్లకి ఐపేడ్లు కాస్తున్నాయా! “ఆపిల్” వాడు ఉచితంగాపంచిపెడ్తున్నాడా?! వీళ్లందరికీ అన్నీ ఎలాగూ కొన్నివ్వలేం కానీ మన ప్రయాణం ఈ సంవత్సరం మానేస్తే ఎలా ఉంటుందంటావ్” అన్నారు గెడ్డం గీరుకుంటూ.”అయినా మనం ఇండియా వెళ్లే ప్లానుందని వీళ్లందరికీ ఎలా తెలిసిందంటావ్” అన్నారు మళ్లీ సాలోచనగా.ఇండియా వచ్చే ప్లాను చేస్తున్నామని అడిగిన వాళ్లకూ, అడగని వాళ్లకూ చెప్పినందుకు ఇలా ప్రయాణం మానేయాల్సొస్తుందని నాకేం తెల్సు?
– డాక్టర్ .కె .గీత
Dr K Geetha,Telugu Kathalu