2024-10-15 03:35:33.0
ఆయన చేసే పనులు ప్రజల స్వేచ్ఛను ప్రమాదంలో పడేస్తాయని మండిపడిన కమలా హారిస్
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఒక మాట మీద నిలబడే వ్యక్తికాదని ఆ దేశ ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మండిపడ్డారు. ఎన్నికల రోజు తన మద్దతు దారులు చేసే పనులు చూసి ఆందోళన చెందబోనని ట్రంప్ ఓ టీవీ షోలో చెప్పారు. మన దగ్గరే చెడ్డ వ్యక్తులు, రాడికల్ లెఫ్ట్ భావజాలంతో వెర్రితలు వేసే ఉన్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన హారిస్ ట్రంప్ చేసే పనులు ప్రజల స్వేచ్ఛను ప్రమాదంలో పడేస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌నకు ఎవరు మద్దతు ఇవ్వకపోయినా, లొంగపోయినా దేశానికి శత్రువుగా పరిగణిస్తాడు. అది ఆయన మాటల్లోనే అర్థమౌతున్నదని వ్యాఖ్యానించారు. ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తే అమెరికాకు ప్రమాదంగా మారుతాడన్నారు. అధికారంలోకి వస్తే ఆయన దేశ సమస్యలపై కాకుండా విద్యార్థులను, జర్నలిస్టులను, ఎన్నికల అధికారులను, న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుంటారని తెలిపారు. తనపై రాజకీయంగా వ్యతిరేకత చూపుతున్న వారిపై చర్యలు తీసుకోవడానికి నేషనల్ గార్డ్ లేదా యూఎస్ మిలిటరీని ఉపయోగించాలని ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తు చేశారు.
గెలుపు అవకాశాలు హారిస్‌కే ఎక్కువ
కాగా.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న సర్వేల్లో ట్రంప్‌తో పోలిస్తే అభ్యర్థి రేసులో గెలుపు అవకాశాలు హారిస్‌కే ఎక్కువగా ఉన్నట్లు వివిధ సర్వేలు వెల్లడించాయి. అంతేగాకుండా ప్రచారం కోసం ఆమెకు పెద్ద మొత్తం విరాళాలు అందుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. అమెరికన్ యూనివర్సిటీ ప్రొఫెసర్, రాజకీయ శాస్త్రవేత్త అలన్ లిచ్‌మన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌పై కమలా హారిస్ విజయం సాధిస్తారని జోస్యం చెప్పారు.
Vice President Kamala Harris,Targets,Former President Donald Trump,Recent comments