2023-07-07 12:27:05.0
https://www.teluguglobal.com/h-upload/2023/07/07/792654-note.webp
కలలు నీవీ కావు
నావీ కావు
నూరుకోట్ల జన కుటుంబానివి
అందరి కలల్నీ
ఓట్లలో రంగరించి
శాసనబద్ధంగా
ఒక సమూహంగా
ఒక సుమార్చనంగా
నివేదిస్తున్నాం
ఐదేళ్ళకోసారి
కాదు కాదు
ఏటికేడాదీ
ఏటికేడాదీ
జీవనపోరాటం చేసే మనకే
ఈ దేశం కార్యక్షేత్రం
వాడికి మాత్రం
దేశమంతా ఎన్నికల కురుక్షేత్రమే
రాజీనామా చేశాడనో
చచ్చిపోయాడనో
గ్రామం నుంచి
ఢిల్లీ దాకా
ఎక్కడో ఒకచోట
ఓట్ల జాతర
వాడు మాత్రం…
ఈ ఏకవచన ప్రయోగమేంటంటావా మిత్రమా
అవును, నువ్వూ నేనూ
అతడూ ఆమే
వెరసి మనమందరం
ఏదో ఒక సందర్భానుసారం
కలల్ని కలబోసుకుంటూనే ఉంటాం
వాడు మాత్రం కలవడు
కలవరపడడు
నీకూ నాకూ
ఆఖరికి చట్టసభలకు సైతం
అజ లేకుండా పోతాడు
ఆరా తీద్దామంటావా
మన కలల్ని గుర్తుచేద్దామంటావా
ఓ వెర్రిబాగుల మిత్రమా
అడిగో అక్కడెక్కడో
రూపాయల్ని బొక్కి
నిద్రపోతున్నట్టులేదూ
దేశమేమైపోతేనేం
పరువేమైపోతేనేం
ఆసాంతం సొంతలాభంగా
ఆర్జించుకున్నదెక్కడ
భద్రపరచాలో తెలీక
పడకపై పరచుకుని
బలిసిన కండల భద్రతలో
మూడంకె వేస్తున్నట్టులేదూ
గురక పెడుతున్న
రొద వినిపించడం లేదూ
నాకు మాత్రం
వాడు పడుకుంటే
ఉబ్బిన ఆ పొట్టలో
విదేశీ బాంకుల్లో జమచేసిన
డబ్బుతాలూకు
అంకెలే కనిపిస్తున్నాయి
చిత్రంగా నీకూ అలాగే
కనిపిస్తున్నాడా
ఇంకా చిత్రంగా వాడిలో
రామాయణ ప్రతినాయకుడూ సోదరుడూ
ఉన్నారంటావా
ఇంకేం, వాడు వాళ్ళ తరమే
రాజకీయ మురికిలో వేసుకున్న
హంసతూలికాతల్పం మీద
నిద్రిస్తున్నట్టు కనిపిస్తోందా
వాడి కలల్లో
ఇక నువ్వేం ఉంటావ్
నీలా నాలా
సామాన్యుడేం ఉంటాడు
ఎముకలు కొరుకుతున్నా
ఒణుకుతూనే బ్రతకాలి
వేడిగాడ్పుల హోరులోనూ
తట్టుకుంటూ నిలబడాలి
వర్షంలో వరదల్లో తడిసిముద్దవుతున్నా
ఆకలి వెతలకూ తాళుకోవాలి
రద్దీని తట్టుకుంటూ
పులిహోర పొట్లాల కోసం
చేతులు చాపాలి
అరవయ్యారేళ్ళ సొరాజ్జెం
పండించిన సిరిసంపదలివి
చూస్తావేం మిత్రమా
ఓటు బల్లెం విసిరెయ్
ఓ పోటుతో నో మాన్స్ ల్యాండ్ లోకి
ద్వీపాంతరవాసంలోకి తన్నెయ్
శిక్ష తీవ్రమేనంటావా
కాస్త కనికరిస్తానంటావా
నోటా మీట నొక్కెయ్
–కొంపెల్ల కామేశ్వరరావు
Kompella Kameswara Rao,Telugu Kathalu