ఓ మంచి కవిత (కవిత)

2023-04-23 11:35:13.0

https://www.teluguglobal.com/h-upload/2023/04/23/732001-o-machi-kavitha.webp

రగిలిపోతున్న నీ మనస్సులో

కరగని హిమ సుమాలు నింపిందా?

చీకట్లు కమ్ముకున్న నీ కళ్లల్లో

తరగని వెన్నెల కురిపించిందా?

చతికిలపడ్డ నీ కాళ్లల్లో

అలుపెరుగని చైతన్యం నింపిందా?

తెగిపోతున్న నీ బంధాలకు

గంధపు సంకెళ్లు వేసిందా?

నీలో దెయ్యాన్ని తరిమి

దైవాన్నిగానీ చూపిందా?

పోనీ నీ బండ గుండెను

దూది పింజలా చేసేసిందా?

ఆలోచించాల్సిందే మరి!

ఒక్క మాట చెప్పు మిత్రమా..

ఈ దేవుళ్లూ దెయ్యాలూ

పోనీకానీ

అద్దంలో నీకిప్పుడు

ఓ మనసున్న మనిషే

కనిపిస్తున్నాడా?

ఇదే నిజమైతే…

ఎప్పటికీ నిజమైతే

ఇంక ఆలోచించక్కర్లేదు

మిత్రమా!

నీ నరనరానా ఎక్కుంటుంది

ఓ మంచి కవిత

-అత్తిలి అనంతు ( ముంబయ్)

O Manchi Kavitha,Telugu Kavithalu