2016-06-07 02:16:21.0
పెళ్లి విషయంలో చాలా మందికి విచిత్రమైన కోరికలు ఉంటాయి. గాల్లో ఎగురుతూ, నీటిమీద తేలుతూ…ఇలా పలురకాలుగా వివాహం చేసుకున్న వారి గురించి విన్నాం. కానీ ఈ జంట అనుకోకుండా, అనుకోని పరిస్థితుల్లో అంబులెన్స్‌లో ఒక్కటయింది. కర్ణాటకకు చెందిన నేత్రావతి, గురుస్వామి ప్రేమించుకున్నారు. మురుగ రాజేంద్రస్వామి అనే పండితుడు చిత్రదుర్గలో స్వయంగా జరిపించే సామూహిక వివాహాల్లో తాము కూడా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే గతనెల 23న చిత్రదుర్గ కోటపైకి గురుస్వామితో కలిసి పిక్నిక్‌కి వెళ్లిన నేత్రావతి, దురదృష్ట […]
పెళ్లి విషయంలో చాలా మందికి విచిత్రమైన కోరికలు ఉంటాయి. గాల్లో ఎగురుతూ, నీటిమీద తేలుతూ…ఇలా పలురకాలుగా వివాహం చేసుకున్న వారి గురించి విన్నాం. కానీ ఈ జంట అనుకోకుండా, అనుకోని పరిస్థితుల్లో అంబులెన్స్‌లో ఒక్కటయింది. కర్ణాటకకు చెందిన నేత్రావతి, గురుస్వామి ప్రేమించుకున్నారు. మురుగ రాజేంద్రస్వామి అనే పండితుడు చిత్రదుర్గలో స్వయంగా జరిపించే సామూహిక వివాహాల్లో తాము కూడా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే గతనెల 23న చిత్రదుర్గ కోటపైకి గురుస్వామితో కలిసి పిక్నిక్‌కి వెళ్లిన నేత్రావతి, దురదృష్ట వశాత్తూ అక్కడ కాలు జారి కిందపడిపోయింది. వెన్నెముకకి తీవ్రమైన గాయం కాగా, ఆమె పైకి లేవలేని పరిస్థితికి చేరింది. నేత్రావతిని మెరుగైన వైద్యం కోసం బెంగలూరులోని నిమ్‌హాన్స్‌కి తీసుకువెళ్లారు.
అప్పటికే వారు వివాహం చేసుకోవాల్సిన తేదీ జూన్ 5 నిశ్చయమైపోయి ఉండటంతో, ఎలాగైనా త్వరగా కోలుకుని పెళ్లి చేసుకోవాలని నేత్రావతి భావించింది. ఆమె పట్టుబట్టటంతో బెంగలూరు వైద్యులు అంబులెన్స్‌లో ఆమెని చిత్రదుర్గ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అయితే ఆమె ఏ మాత్రం కదలకూడదని చెప్పారు. నేత్రావతి అలాగే కదలకుండానే అంబులెన్స్‌లోనే వివాహాలు జరుగుతున్న ప్రాంగణానికి చేరింది. మురుగ రాజేంద్రస్వామి అంబులెన్స్ వద్దకు వచ్చి వారి వివాహాన్ని జరిపించాడు. మెడ కూడా కదపలేని నేత్రావతి మెడలో గురుస్వామి తాళి కట్టాడు. ఎలాంటి అలంకరణలు, ఆడంబరాలు లేకుండా, కనీసం కల్యాణతిలకం కూడా దిద్దుకోకుండానే నేత్రావతి పెళ్లికూతురయింది. వారిద్దరికీ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, నమ్మకాలే వారిని ఒకటిగా చేశాయి. ఇద్దరూ ఒకటే కులం కావటంతో ఇరు కుటుంబాల వారు మొదట వివాహానికి ఒప్పుకున్నా నేత్రావతి పరిస్థితి చూశాక గురుస్వామిని అతని తరపువారు ఆ పెళ్లి చేసుకోవద్దని వారించారు. కానీ అతను వారి మాట వినలేదు.
సరైన మందులు, ఫిజియోథెరపీ ఉంటే ఆమె కొన్ని నెలల్లో కోలుకుంటుందని, అయితే ఆమె కోలుకోలేని పరిస్థితులు ఏర్పడితే మాత్రం మేజర్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. నేత్రావతి తన మనోబలంతో, భర్త ప్రేమతో త్వరగా కోలుకుంటుందని ఆశిద్దాం.